తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్ ఎంటర్టైనర్ ను తెలుగులో 'శశికళ' పేరుతో అనువదిస్తున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. జయరాజ్, నితిన్ రాజ్, మిషా ఘోషల్ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''అందరినీ భయపెడుతూ.. వినోదాన్ని అందించే హారర్ ఎంటర్టైనర్ ఇది. భారతీరాజా సోదరుడు జయరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. నిజానికి ఏప్రిల్ 1న సినిమా రిలీజ్ చేయాలనుకున్నాం. కాని అదేరోజు 14 సినిమాలు రిలీజ్ అవుతుండడంతో రెండు వారాల గ్యాప్ తరువాత రిలీజ్ చేయాలనుకుంటున్నామని'' తెలిపారు.
''లాభనష్టాలను లెక్కచేయకుండా రామసత్యనారాయణ సినిమాలను తీస్తూనే ఉన్నాడు. ఈ సినిమా ఆయనకు పెద్ద హిట్ ఇవ్వాలని'' రేలంగి నరసింహారావు చెప్పారు.
''ఈ సినిమా విజయాన్ని సాధించి ఎందరికో స్పూర్తిగా నిలవాలని'' సుధాకర్ బాబు అన్నారు.
ఇంకా కార్యక్రమంలో రాజ్ కందుకూరి, లోహిత్, సిరాశ్రీ, రవి తదితరలు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: వెంకటేష్, సంగీతం: నిత్యన్ కార్తిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: డా. శివ వై. ప్రసాద్-బి. సత్యనారాయణ, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విను భారతి.