రామచంద్ర, ఆశాలత జంటగా అక్షయ్ ప్రత్యూష ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జి.మురళీ ప్రసాద్ దర్శకత్వంలో రామచంద్ర దోసపాటి నిర్మించిన చిత్రం 'అమ్మాయి ఆరుగురు'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత రామ్ చంద్ర విలేకర్లతో ముచ్చటించారు.
''ఈ సినిమా బావ మరదళ్ళ ప్రేమ కథ. ఒక అమ్మాయిని ఆరుగురు అబ్బాయిలు అత్యాచారం చేసి చంపేస్తారు. చనిపోయిన ఆ అమ్మాయి దయ్యంగా మారి ఆ ఆరుగురు మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. హారర్, కామెడీ నేపధ్యంలో సాగే కథ. 35 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసేసాం. హీరోయిన్ ఆశాలత చక్కగా నటించింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తలకోన ప్రాంతంలోని దుర్గమ్మ కొండ దగ్గర సినిమా చిత్రీకరణ జరుపుకున్నాం. వందేమాతరం శ్రీనివాస్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. దర్శకుడు మురళీ ప్రసాద్ మంచి కథను చక్కగా ప్రెజంట్ చేశారు. సినిమాలో మొత్తం 5 పాటలు ఉంటాయి. చిన్నప్పటినుండి సినిమాల్లో నటించాలనేది నా కోరిక. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నాను. ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మరో రెండు నెలల తరువాత కొత్త ప్రాజెక్ట్ లో నటించబోతున్నాను'' అని చెప్పారు.