విజయ్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తమిళ్‌లో నిర్మించిన కత్తి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర కథకు సంబంధించి గత 16 నెలలుగా వివాదం జరుగుతున్న విషయం కూడా తెలిసిందే. తెలుగు రచయిత నరసింహారావు కత్తి కథను తన దర్శకత్వంలోనే చెయ్యాలన్న ఉద్దేశంతో హీరో విజయ్‌కి, నిర్మాత ఆర్.బి.చౌదరికి వినిపించడం, వారికి బాగా నచ్చడం జరిగింది. దానికి సంబంధించి చాలా సిట్టింగ్స్ జరిగాయి. నరసింహారావు మూడు వెర్షన్స్ చెప్పడం కూడా జరిగింది. హేరిస్ జయరాజ్ అందుబాటులో లేకపోవడంతో థమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిపారు. అయితే ఈ కథను కొత్త దర్శకుడితో కాకుండా పెద్ద డైరెక్టర్‌తో చేస్తే బాగుంటుందని, కథ తమకు ఇవ్వమని నరసింహారావుని అడగడం, దానికి నరసింహారావు ఒప్పుకోకపోవడంతో అక్కడితో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అలా సంవత్సరం గడిచిన తర్వాత మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన కత్తి రిలీజ్ అవడం, పెద్ద హిట్ అవ్వడం జరిగిపోయింది. తన కథతోనే కత్తి సినిమా తీశారని తెలుసుకున్న నరసింహారావు కథా హక్కుల వేదిక సమన్వయ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ కమిటీకి ఛైర్మన్‌గా వున్న దాసరి నారాయణరావు సినిమాను, నరసింహారావు రిజిష్టర్ చేసుకున్న కథని పరిశీలించిన మీదట, కత్తి కథలో కొన్ని మార్పులు చేసినప్పటికీ కథలోని ఆత్మ మాత్రం నరసింహారావుదేనని తేల్చారు. వెంటనే తమిళనాడు ఫిలిం ఛాంబర్ సభ్యులను హైదరాబాద్‌కి పిలిపించి వారితో చర్చలు జరిపి రైటర్ నరసింహారావుకి పరిహారం చెల్లించాలని చెప్పడం, దానికి తమిళనాడు ఫిలిం ఛాంబర్ సభ్యులు కూడా అంగీకరించడంతో అక్కడితో సమస్య పరిష్కారమైపోయింది అనుకున్నారు. కానీ, తమిళనాడు ఫిలిం ఛాంబర్ వెర్షన్ మార్చుకొని ఒక లీగర్ ఎడ్వయిజర్ చెప్పిన విషయాలను తెలుగు ఫిలిం ఛాంబర్‌కు పంపించారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులను చెన్నయ్ ఆహ్వానించారు. కానీ, పరిష్కారమైపోయిందనుకున్న సమస్య గురించి చర్చించేందుకు మళ్ళీ మనం వెళ్ళడం కరెక్ట్ కాదనుకున్న ఫిలిం ఛాంబర్ తాము కూడా లీగల్‌గానే వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు. ఈ తతంగం అంతా 16 నెలలుగా జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి కత్తి సినిమాని తెలుగులో చెయ్యాలని డిసైడ్ అవ్వడంతో రైటర్స్ అసోసియేషన్, కథా హక్కుల వేదిక సమన్వయ కమిటీ కలిసి ఫిలిం ఫెడరేషన్‌కు ఒక లేఖ పంపారు. తమ రైటర్‌కి కత్తి సినిమా కథ విషయంలో అన్యాయం జరిగింది కాబట్టి 24 క్రాప్ట్స్‌లోని వారంతా ఈ సినిమా రీమేక్‌కి సహాయ నిరాకరణ ప్రకటించాలని కోరింది. కత్తి సినిమా కథకు సంబంధించి వచ్చిన వివాదం పూర్తి సారాంశం ఇది.
ఇదిలా వుంటే చిరంజీవి 150వ సినిమాకి దాసరి నారాయణరావు అడ్డుపడుతున్నారని, కావాలనే ఈ సినిమాకి సహాయ నిరాకరణ చేస్తున్నారని కొన్ని వెబ్‌సైట్స్‌లో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతటితో ఆగకుండా చిరంజీవి సినిమాకి అడ్డు పడిన దాసరి నారాయణరావు యాక్సిడెంట్‌లో మరణించారని, ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నామని రామచరణ్ ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన దాసరి నారాయణరావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిరంజీవికి, దాసరి నారాయణరావుకి మధ్య మనస్పర్థలు లేపేందుకు, అగాధం సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని భావించిన రైటర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ఫిలిం ఫెడరేషన్, కథా హక్కుల వేదిక సమన్వయ కమిటీ సోమవారం ఒక ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో ఆయా సంఘాల సభ్యులు మాట్లాడుతూ మన రచయిత నరసింహారావుకి కత్తి విషయంలో జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత హీరో విజయ్‌దే. నరసింహారావు చెప్పిన మూడు వెర్షన్‌ల కథ విన్న విజయ్ సంవత్సరం తర్వాత మురుగదాస్ అదే కథ చెప్పినపుడు ఆల్రెడీ ఈ కథ నేను విన్నాను అని చెప్పాల్సిన బాధ్యత విజయ్‌కి వుంటుంది. డైరెక్టర్ కావాలని కలలు కంటూ నాలుగు సంవత్సరాలు కష్టపడి నరసింహారావు రాసుకున్న కథని మురుగదాస్ చెప్పగానే అతనితో సినిమా చేసిన విజయ్‌కి మానవత్వం లేదా? ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో చిరంజీవిగారు చెయ్యాలనుకున్నారు. దీనికి సంబంధించిన వివాదం గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళినపుడు కథకు సంబంధించి అని సమస్యలు పరిష్కారం అయిన తర్వాతే ఆ కథతో సినిమా చేస్తానని చిరంజీవిగారు స్పష్టంగా చెప్పారు.
16 నెలలుగా ఈ కథకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకోకుండా కొన్ని వెబ్‌సైట్స్‌లో చిరంజీవి 150వ సినిమాకి దాసరి అడ్డు తగిలారని రాయడం, సోషల్ మీడియాలో దాసరిగారు చనిపోయారని పోస్ట్ చెయ్యడం ఇండస్ట్రీలోని అందర్నీ బాధ పెట్టింది. దీన్ని మేం ఖండిస్తున్నాం. 50 సంవత్సరాల సినీ జీవితంలో దాసరిగారు ఎన్నో సమస్యలను పరిష్కరించారు. అలాంటి సమస్యలో ఇదీ ఒకటి తప్ప తన వ్యక్తిగత సమస్య కాదు. దాసరిగారు మృతి చెందారని సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారన్న విషయాన్ని ఐపి అడ్రస్‌ల ద్వారా పోలీసులు కనుక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే దానికి బాధ్యులైనవారిపై చర్య తీసుకుంటారు. ఈ సమావేశం ద్వారా మేం చెప్పదలుచుకున్నది ఏమిటంటే కత్తి సినిమాని తెలుగులో ఏ హీరో చేసినా ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, రైటర్ నరసింహారావుకి న్యాయం చెయ్యకుండా తెలుగులో ఈ సినిమాని నిర్మించాలని అనుకుంటే మాత్రం 24 క్రాఫ్ట్స్ నుంచి వారికి ఎలాంటి సహకారం వుండదు. మా రైటర్ నరసింహారావుకు న్యాయం జరిగే వరకూ మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్నారు.