దేశాభివృద్ధిలో చార్టర్డ్ ఎకౌంటెంట్స్ పాత్ర ఎంతో కీలకమని, ప్రతి వ్యవస్థకు సి.ఎ.లు అవసరం వుంటుందని హీరో ఆదిత్య ఓం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ప్రముఖ సి.ఎ. సంస్థ దాట్ల అసోసియేట్స్‌లో పనిచేస్తున్న నాగోల్ మోహన్‌కుమార్‌కు ఆల్ ఇండియా స్థాయిలో 2వ ర్యాంకు లభించింది. చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సులో జాతీయ స్థాయిలో మోహన్‌కుమార్‌కు 2వ ర్యాంకు రావడం ఎంతో అభినందనీయమని ఆదిత్య ఓం అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హీరో, ఎడ్యులైట్‌మెంట్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఆదిత్యఓం, గ్రామ స్వరాజ్య ఫౌండేషన్ అధినేత విజయ్‌వర్మ పాకలపాటి, దాట్ల అసోసియేట్స్ బృందం సంయుక్తంగా హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోహన్‌కుమార్‌ను అభినందనలతో ముంచెత్తారు.
ఈ సందర్భంగా హీరో ఆదిత్యఓం మాట్లాడుతూ విద్యావెలుగుని అందించాలనే సంకల్పంతో ఎడ్యులైట్‌మెంట్ సంస్థను ప్రారంభించామని ఆల్‌ఇండియా సి.ఎ. టాపర్-2 గా తెలుగు విద్యార్థికి అవకాశం దక్కటం ఎంతో గర్వకారణమని ఆయన తెలిపారు. మోహన్‌కుమార్‌ను అభినందించాలన్న ఉద్దేశంతో తాను అ కార్యక్రమానికి హాజరయ్యానని అన్నారు. గ్రామీణులు విద్యారంగంలోని అవకాశాలను అంది వుచ్చుకుని రాణించాలని ఆయన ఆకాంక్షించారు. తమ సంస్థ తరవున పేద విద్యార్థులకు సహకారం అందించేందుకు తానెప్పుడూ ముందుంటానని ఆదిత్యఓం అన్నారు.
ఈ సందర్భంగా సి.ఎ. టాపర్ నాగోలుమోహన్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని దాట్ల అసోసియేట్స్‌లో ఆర్టికల్స్ చేస్తూ విజయవాడ సూపర్‌విజ్‌లో శిక్షణ పొందానని, సూపర్‌విజ్ బోధనతో పాటు దాట్ల అసోసియేట్స్ అధినేత రామరాజు అందించిన సహకారం, సలహాలు తనకు జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచేందుకు దోహదపడ్డాయని తెలిపారు. దృఢమైన కోరిక, కఠోర శ్రమ, నిరంతర అధ్యయనంతో సి.ఎ. పూర్తి చేయటమే కాకుండా టాపర్‌గా రాణించేందుకు అవకాశం ఉంటుందని, ఈ క్రమంలో తనను ప్రోత్సహించిన సూపర్‌విజ్, దాట్ల అసోసియేట్స్ అధినేత రామరాజు, తల్లిదండ్రులకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
అనంతరం గ్రామ స్వరాజ్యం ఫౌండేషన్ అధ్యక్షులు, దర్శకనిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన మోహన్ జాతీయ స్థాయిలో సి.ఎ. టాపర్-2గా విజయం సాధించటం తెలుగువారికి గర్వకారణమని ప్రశంసించారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు మోహన్‌కుమార్ స్ఫూర్తిదాయకమని వర్మ అభినందించారు. అనంతరం దాట్ల అసోసియేట్స్ అధినేత శ్రీరామరాజు దాట్ల మాట్లాడుతూ తన సంస్థలో ఆర్టికల్స్‌కై చేరిన సమయంలోనే మోహన్‌కుమార్ టాపర్‌గా రాణిస్తాడని ఊహించానని, ఓ పక్క ఆర్టికల్స్ చేస్తూ మరో పక్క కోర్సుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిరంతర శ్రమతో తను ఈ విజయాన్ని సాధించాడని, తమ సంస్థలో ఆర్టికల్స్ చేసిన ఓ వ్యక్తి టాపర్‌గా నిలవడం తమకు గర్వకారణమని అన్నారు.