శర్వానంద్, సురభి జంటగా మేర్లపాక గాంధి దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం 'ఎక్స్ ప్రెస్ రాజా'. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో..
దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ''స్టేజీ మీద డాన్స్ చేయాలనేంత ఆనందంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత శర్వా, యు.వి. క్రియేషన్స్ వారిలో సంతోషం చూడాలనుకున్నాను. అనుకున్నట్లుగానే సినిమా పెద్ద విజయం సాధించింది. కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని ఎంతో సహకారం అందించారు. మా చిత్రాన్ని ఆడరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని చెప్పారు.
శర్వానంద్ మాట్లాడుతూ.. ''బ్రహ్మాజీగారు ఫోన్ చేసి చెప్తే నేను ఈ సినిమా కథ విన్నాను. గాంధీ ప్రతి పాత్రను ఎంతో అధ్బుతంగా తీర్చిదిద్దారు. డైలాగులు లేకపోయినా.. ధనరాజ్ క్యారెక్టర్ ను ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నా డాన్సులకు మంచి అభినందనలు లభించాయి. ఆ క్రెడిట్ మొత్తం కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ కే చెందుతుంది. ప్రమోద్ అన్నయ్యకు స్పెషల్ థ్యాంక్స్'' అని అన్నారు.
ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ.. ''నా రూంలో కూర్చొని నాలుగు ట్యూన్స్ కంపోజ్ చేసి ఇచ్చేసాను. కానీ యువి క్రియేషన్స్ వారి ప్రొడక్షన్ వేల్యూస్, గాంధీ టేకింగ్, శర్వానంద్ ఫేస్ వేల్యూ కలగలిపి నా పాటలను సూపర్ హిట్ గా నిలిపాయి. నాకు ఇంత మంచి అవకాశాన్నిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు'' అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతల్లో ఒకరైన ప్రమోద్, బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చిన జెబి, కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని, కళా దర్శకులు రవిప్రకాష్, నటులు బ్రహ్మాజీ, ధనరాజ్, నాగినీడు తదితరులు పాల్గొన్నారు.