గత రెండు సంవత్సరాలుగా దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగిన గామా అవార్డ్స్ గల్ఫ్ తెలుగు సాంస్కృతిక చరిత్రలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించాయి. ఈ సంవత్సరం కూడా భారీగా గామా అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12, 2016 న దుబాయ్ జబీల్ పార్క్ లో జరగబోయే ఈ అవార్డ్స్ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరవబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..
గామా అవార్డ్స్ చైర్మెన్ కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ.. ''ప్రతిష్టాత్మకమైన ఈ గామా జీవన సాఫల్య పురస్కారాన్ని 2016 వ సంవత్సరానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు గారికి అందిస్తున్నాం. గత రెండు సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తోన్న గామా అవార్డ్స్ ను ఈ సంవత్సరం ఫిబ్రవరి 12 న నిర్వహించనున్నాం. ఈ సంవత్సరం కొత్తగా 'మూవీ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని అందించాలని సంకల్పించాం. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన 'బాహుబలి' చిత్రం ఈ అవార్డు ను అందుకోనుంది'' అని చెప్పారు.
శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. ''బాహుబలి సినిమాకు స్పెషల్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. 15 సంవత్సరాలుగా ఈటీవి వారితో మంచి సాన్నిహిత్యం ఉంది. వారు గామా అవార్డ్స్ తో అసోసియేట్ అవ్వడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
కోటి మాట్లాడుతూ.. ''సంగీతానికి సంబంధించిన వివిధ కేటగిరీలలో అవార్డులు ఇవ్వడంతో పాటు మూవీ ఆఫ్ ది ఇయర్ గా 'బాహుబలి' చిత్రానికి అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సుమ, ఫణి, చంద్రబోస్, దీపు, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.