'నేను శైలజ' లాంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీస్ తీస్తూనే ఉంటా!
- 'స్రవంతి' రవికిశోర్
మూడు దశాబ్దాల కాలంలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలను నిర్మించి, తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది 'స్రవంతి' మూవీస్ సంస్థ. ఈ సంస్థపై 'లేడీస్ టైలర్' నుంచి తాజా 'నేను శైలజ' వరకూ పలు సూపర్ హిట్ మూవీస్ అందించిన ఘనత 'స్రవంతి' రవికిశోర్ ది. కృష్ణచైతన్య సమర్పణలో రామ్ హీరోగా ఆయన నిర్మించిన తాజా చిత్రం 'నేను శైలజ' ఈ జనవరి 1న విడుదలైన విషయం తెలిసిందే. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతోంది. రామ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే కావడం విశేషం. కాగా, ఈ చిత్రదర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలోనే రామ్ హీరోగా మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు రవికిశోర్.
ఈ చిత్రం గురించి ఇటీవల రవికిశోర్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ చిత్రానికి ఆయన నిర్మాతగా కాకుండా సమర్పకుడిగా మాత్రమే వ్యవహరించనున్నారు. ఈ చిత్రనిర్మాణం బాధ్యతలను కృష్ణచైతన్యకు అప్పగిస్తున్నారాయన.
దీని గురించి రవికిశోర్ వివరణ ఇస్తూ - ''నిర్మాణం పరంగా కృష్ణచైతన్య మెళకువలు తెలుసుకున్నాడు. తనను ఎంకరేజ్ చేయడం కోసమే త్వరలో రామ్ తో తీయబోయే చిత్రం నిర్మాణ బాధ్యతలు కృష్ణచైతన్యకు అప్పగించాలనుకున్నాను. అంతే తప్ప నిర్మాతగా రిటైర్ కావాలనే ఆలోచన లేదు. మంచి చిత్రాలు నిర్మిస్తాననే నమ్మకం ఉన్నంతకాలం నిర్మాణ రంగానికి దూరం కాను. ఆ నమ్మకం పోయినప్పుడే రిటైర్ అవుతాను. 'నేను శైలజ' వంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని మరిన్ని అందించాలన్నదే నా సంకల్పం'' అన్నారు.