సుధీర్ బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్ కుమార్, శశిధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. డిశంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి సుధీర్ తండ్రిగా నటించిన పరుచూరి గోపాలకృష్ణ విలేకర్లతో ముచ్చటించారు.
సినిమా గురించి మీ మాటల్లో..?
పని లేకుండా గాలికి తిరిగే, ఈ కుర్రాడికి ఓ అందమైన అమ్మాయి దొరుకుతుంది. ఒకరోజులో ముగిసే కథే ఈ 'భలే మంచిరోజు'. సినిమాలో మెకానిక్ పాత్రలో నేను, నా కొడుకుగా సుధీర్ బాబు కనిపించనున్నాం.మా రెండో అన్నయ్య మెకానిక్ గా పనిచేశారు. ఇప్పుడు ఆయన లేరు. సినిమాలో నా బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం, అన్నయ్యను కాపీ చేశాను.
సుదీర్ బాబుతో నటించడం ఎలా అనిపించింది..?
నందమూరి తారక రామారావు నన్ను, అన్నయ్యను రచయితలుగా పరిచయం చేస్తే.. కృష్ణగారు ఆయన నటిస్తున్న చిత్రాల్లో అవకాశం ఇచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు. ఎన్టీఆర్, కృష్ణ మాకు రెండు కళ్లు. ఈ చిత్రంలో కృష్ణ అల్లుడికి తండ్రిగా నటించడం సంతోషంగా ఉంది. సుధీర్ బాబు నేచురల్ యాక్టర్. సినిమాలో బాగా నటించాడు.
దర్శకుడు శ్రీరామ్ గురించి చెప్పండి..?
కృష్ణవంశీ తరువాత నాకు బాగా నచ్చిన దర్శకుడు శ్రీరామ్. ఆర్టిస్టుల నుంచి కావలసిన పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడం తనకు బాగా తెలుసు. సీన్ లో ఎలా కనిపించాలో నటించి మరీ చూపిస్తాడు. ఆయనలో అదొక మంచి లక్షణం ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులకు వినోదాత్మక చిత్రాలు మాత్రమే నచ్చుతున్నాయి. ఆ వినోదం అంతా ఈ సినిమాలో ఉంటుంది. సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.