హాస్యనటుడు అలీ చేస్తున్న కామెంట్ల గురించి బయట జనాలు గగ్గోలు పెడుతున్నా... హీరోయిన్లు మాత్రం ఆయన్ని వెనకేసుకొస్తున్నారు. నవ్వించడానికే కదా, లైట్ తీస్కుందాం... అంటున్నారు. ఆమధ్య సమంత నడుమును విజయవాడ బెంజ్ సర్కిల్‌తో పోలుస్తూ మాట్లాడాడు అలీ. ఆ కామెంట్లపై అప్పట్లో విమర్శలొచ్చాయి. అయితే సమంత మాత్రం ``అలీ ఎలాంటోడో నాకు తెలుసు, ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంటాడో కూడా నాకు తెలుసు. ఆ మాటల్ని సీరియస్‌గా తీసుకోనక్కర్లేదు`` అని చెప్పుకొచ్చింది. ఆ వివాదం పూర్తిగా సద్దుమణగకముందే సైజ్‌జీరో ఆడియో వేడుకలో అనుష్క తొడల గురించి అలీ కామెంట్లు చేశాడు. ఆ కామెంట్లు కూడా వివాదాస్పదమయ్యాయి. కొద్దిమంది మహిళలు, మహిళాసంఘాలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కొచ్చి అలీపై కన్నెర్రజేశారు. అలీ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఇక అలాంటి కామెంట్లు చేయననీ, అసలు వేదికలపై ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకొన్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే సైజ్ జీరో ప్రమోషన్స్‌లో భాగంగా అనుష్క ఇటీవల మీడియా ముందుకొచ్చింది. అక్కడ అలీ చేసిన కామెంట్ల గురించి ప్రస్తావించినప్పుడు నవ్వుతూ అలీకే మద్దతుగా మాట్లాడింది అనుష్క. ``అలీ, ఆయన కుటుంబమూ నాకు బాగా తెలుసు. ఆ మాటలు దురుద్దేశంతో అన్నవి కావు కదా. లైట్ తీస్కొందాం`` అని చెప్పుకొచ్చింది. నిజంగా మన కథానాయికలది ఎంత మెత్తటి మనసో కదా!
Advertisement
CJ Advs