లోకనాయకుడు కమల్ హాసన్, త్రిష జంటగా రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో ఎన్.చంద్రహాసన్ నిర్మించిన 'చీకటి రాజ్యం'. నవంబర్ 20న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా..
కమల్ హాసన్ మాట్లాడుతూ.. ''ఇదొక డిఫరెంట్ సబ్జెక్టు. అందరం కష్టపడి పని చేసాం. ఈ చిత్రాన్ని గనుక ఆదరించకపోతే ఇలాంటి మంచి చిత్రాలు రావడానికి కనీసం ఇంకో పదేళ్ళు పట్టేది. 'మరో చరిత్ర' తరువాత ఎంత సంతృప్తి పొందానో.. ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులు అంత సంతోషాన్నిచ్చారు. ఈ ప్రోత్సాహంతో తెలుగులో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాను. నాతో కొన్ని సంవత్సరాల క్రితం 'చానక్యన్' చిత్రాన్ని తెరకెక్కించిన రాజీవ్ కుమార్ దర్శకత్వంలో 'అమ్మా నాన్న ఆట' అనే చిత్రంలో నటించనున్నాను. రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అమల అక్కినేని లీడ్ రోల్ లో నటించనున్నారు. మంచి ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాగా చిత్రాన్ని రూపొందించనున్నాం. ఆరు నెలల్లో చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం'' అని చెప్పారు.
అమల మాట్లాడుతూ.. ''తెలుగు ఇండస్ట్రీకు కొత్త రకమైన సినిమా 'చీకటిరాజ్యం'. చాలా బాగా తీశారు. మంచి స్క్రిప్ట్. అందరూ చక్కగా నటించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
మల్టీడైమెన్షన్ వాసు మాట్లాడుతూ.. ''ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన కమల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రెండు రాష్ట్రాల్లో 231 థియేటర్లలో విడుదలయిన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రోజురోజుకి కలెక్షన్లు పెరుగుతున్నాయి. సోమవారం(నవంబర్23) నుండి 25 నుండి 30 స్క్రీన్స్ పెంచనున్నాం. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని చెప్పారు.
దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. ''టీం ఎఫర్ట్ వలనే విజయం సాధ్యమైంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కమల్ సర్ కి థాంక్స్. ప్రేక్షకులు ఆదరించిన విధానం నాలో కాన్ఫిడెన్స్ ను పెంచింది. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలనుకుంటున్నాను'' అని చెప్పారు.
అబ్బూరి రవి మాట్లాడుతూ.. ''సినిమా చాలా థ్రిల్లింగ్ గా నడుస్తుంటుంది. నెక్స్ట్ సీన్ లో ఏం జరుగుతుందనే..? క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. మంచి సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని చెప్పారు.