మహేష్ బాబు, శ్రుతిహాసన్ జంటగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు'. ఆగష్టు 7న విడుదలయిన ఈ చిత్రం 100 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఇటీవల మహేష్ బాబు ఈ చిత్రంలో ఉపయోగించిన సైకిల్ ను పొందవచ్చని చిత్రబృందం ఓ కాంటెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కాంటెస్ట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని సమజానికి ఉపయోగపడాలని రెండు సంస్థలకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా..
కొరటాల శివ మాట్లాడుతూ.. ''శ్రీమంతుడు చిత్రం 100 రోజులు సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడింది. ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్ ను కమర్షియల్ గా కూడా కొత్తగా ఉందని పెద్ద విజాయాన్నందించారు. ఈ చిత్రం ద్వారా కొంతయినా.. సమాజానికి సహాయం చేయాలని భావించి 'శ్రీమంతుడు' సైకిల్ కాంటెస్ట్ ను నిర్వహించాం. ఆ కాంటెస్ట్ ద్వారా వచ్చిన సొమ్మును మంచి పనులకు ఉపయోగపడేలా చేశాం'' అని చెప్పారు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ''సుమారుగా 2200 మంది ఈ కాంటెస్ట్ లో పేరును నమోదు చేసుకున్నారు. రిజిస్టర్ అవ్వడానికి ప్రతి మనిషి 999 రూపాయలు చెల్లించారు. ఈ నెల 15న మహేష్బాబు విజేతను ప్రకటించడం జరిగింది. నమోదు చేసుకున్న వారికి మహేష్ బాబు సంతకం చేసిన కొన్ని టీషర్ట్స్ ను వారి అడ్రస్సులకు పంపించాం. తద్వారా మిగిలిన 15 లక్షల రూపాయలను 'బసవతారకం కాన్సర్ హాస్పిటల్'కు 5 లక్షలు, 'హీల్ ఏ చైల్డ్' సంస్థకు 10 లక్షల రూపాయల చొప్పున అందజేస్తున్నాం'' అని చెప్పారు.
నమ్రత శిరోద్కర్ మాట్లాడుతూ.. ''శ్రీమంతుడు చిత్రాన్ని ఇంత బాగా ఆదరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయడానికి ప్రయత్నిస్తాం. సైకిల్ కాంటెస్ట్ ను కూడా పెద్ద విజయం చేసారు'' అని చెప్పారు.