ఒకప్పుడు చిత్రాలు ఏ సమయానికి రిలీజ్ అవుతాయని చెప్పేవారో.. అదే డేట్ కు ఖచ్చితంగా రిలీజ్ అయ్యేవి. కాని ఈ మధ్యకాలంలో దాదాపు పెద్ద హీరోల సినిమాలు ఏ ఒక్కటి అనౌన్సు చేసిన డేట్ కు రిలీజ్ అవ్వలేదు. ఇతర సినిమాల కారణంగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ నిర్మాతలు పివిపి, రాధామోహన్, కోన వెంకట్ లు కలిసి ఒక నిర్ణయానికొచ్చి తమ తమ సినిమాలను ముగ్గురికి అనుకూలమైన తేదీలలో వారం వారం గ్యాప్ తో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను తెలిపేందుకు సోమవారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..
కోన వెంకట్ మాట్లాడుతూ.. ''ఈ మధ్యకాలంలో రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ డ్రామా జరుగుతోంది. మొదట మా చిత్రం 'శంకరాభరణం'ను నవంబర్ 20న రిలీజ్ చేయాలని భావించాం కాని 'సైజ్ జీరో' లాంటి పెద్ద బడ్జెట్ సినిమాతో పోటీ పడడం మంచిది కాదని డిసెంబర్ 4 కు వాయిదా వేసుకున్నాను. ప్రొడ్యూసర్ అనేవాడు పైరసీ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్ చాలా ముఖ్యం. రెండు, మూడు రోజుల్లో పైరసీ వచ్చేస్తుండడం వలన సినిమా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో రెండు పెద్ద చిత్రాలు ఒకేసారి రావడం ఇండస్ట్రీకు ఆరోగ్యకరం కాదనే ఉద్దేశ్యంతో పివిపి గారు నేను, రాధామోహన్ కలిసి మాట్లాడుకొని రిలీజ్ డేట్ విషయంలో ఒక నిర్ణయానికొచ్చాం. మొదటగా నవంబర్ 27న 'సైజ్ జీరో', డిసెంబర్ 4న 'శంకరాభరణం', డిసెంబర్ 10న 'బెంగాల్ టైగర్' చిత్రాలను రిలీజ్ చేస్తున్నాం. మూడు సినిమాలు గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
పివిపి మాట్లాడుతూ.. ''నిజజీవితంలో నిజమైన హీరో రాధామోహన్. భారీ బడ్జెట్ తో ఆయన తెరకెక్కించిన 'బెంగాల్ టైగర్' సినిమాను 'అఖిల్' సినిమా కోసం వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం సినిమా లైఫ్ స్పాన్ వారం రోజులు మాత్రమే. రెండు సినిమాలు ఒకేరోజు రావడం వలన నిర్మాతలు నష్టపోతారనే ఉద్దేశ్యంతో కోన గారు, నేను, రాధామోహన్ చర్చించుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని చెప్పారు.
రాధామోహన్ మాట్లాడుతూ.. ''అఖిల్' సినిమా వలన మా చిత్రం మొదటి కాపీ రెడీ అయినా.. పోస్ట్ పోన్ చేశాం. రెండు సినిమాలకు డిస్ట్రి బ్యూటర్స్ ఒక్కరే కావడం వలన వాయిదా వేయాల్సివచ్చింది. రెండు వారాల గ్యాప్ ఉంటుందని మరో ఆలోచన లేకుండా అక్టోబర్ 27న రిలీజ్ చేస్తున్నామని అనౌన్సు చేశాను. కాని నిర్మాతలందరూ బాగుండాలనే ఉద్దేశ్యంతో మా చిత్రాన్ని డిసెంబర్ 10 కు వాయిదా వేశాం'' అని చెప్పారు.