మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటి౦చిన చిత్రం శ్రీమ౦తుడు. ఈ సినిమాతోనే మైత్రీ మూవీమేకర్స్ స౦స్థ చిత్ర నిర్మాణ ర౦గ౦లోకి అడుగుపెట్టి౦ది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ మాదేనని శరత్ చంద్ర అనే రచయిత చెన్నై ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేసారు. ఈ సందర్భంగా..
నిర్మాత వెంకట్రావు మాట్లాడుతూ.. 2012 లో శరత్ చంద్ర గారు రాసిన చచ్చేంత ప్రేమ అనే ప్రముఖ నవల స్వాతి పత్రికలో ప్రచురితమైంది. అదే సంవత్సరం ఆరవ నెలలో ఆ నవలను చిత్రంగా తెరకెక్కించాలని అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. సముద్ర గారి దర్శకత్వంలో హీరో నారా రోహిత్ తో చేయాల్సిన సినిమా కొన్ని కారణాల వలన లేట్ అవుతూ వచ్చింది. ఈలోగా కొరటాల శివ అనే వ్యక్తి కొందరు నిర్మాతలతో కలిసి శ్రీమంతుడు చిత్రంగా మా కథనే తెరకెక్కించారు. చిన్న నిర్మాతగా నేను ఆ చిత్రాన్ని నిర్మించినా.. కథలో ఉన్న కంటెంట్ వలన ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యేది. మా కథను కొరటాల అండ్ టీం సినిమా చేయడం వలన నిర్మాతగా నేను నష్టాల పాలయ్యాను. అందుకే చెన్నై లోని ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేసాం.. అని చెప్పారు.
రచయిత శరత్ చంద్ర మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే కథలు తీసుకొని సినిమాగా చేయాలని దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తుంటాను. అన్ని చౌర్యాల కంటే మేధో చౌర్యం అనేది పెద్ద నేరం. గొప్ప చిత్రాలను తీసామని కొందరు బాహ్య ప్రపంచానికి కనపడుతున్నారు. ఇంటికి కన్నం వేయడం ఎంత పెద్ద నేరమో.. రచయిత సృజనాత్మకతను దొంగిలించడం కూడా అంతే నేరం. కేరళ లో ఉన్న నేను కొందరు రచయిత మిత్రుల సూచనలతో శ్రీమంతుడు సినిమా చూసాను. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో నా నవలకు సంబంధించిన పలు అంశాలు కలిసాయి. వాళ్లకు స్క్రిప్ట్ నేనే చెప్పానని అపార్ధం చేసుకున్న జయలక్ష్మి ఫిల్మ్స్ సంస్థ నాకు లీగల్ నోటీస్ ఇచ్చారు. నా వ్యక్తిత్వానికి మకిలి పడకూడదని కొరటాల శివ గారితో ఫోన్ లో మాట్లాడాను. ఆయన యు.ఎస్ లో ఉండడం వలన ఇండియా వచ్చిన తరువాత కలిసి మాట్లాడాను. స్క్రిప్ట్ కాపీ చేసారని, నిజ నిర్ధారణ కోసం కమిటీ వేయమని కోరాను. రచయితల సంఘం సభ్యుడిగా ఉన్న నేను సంస్థ కార్యదర్శి ఆకెళ్ళ గారికి ఆధారాలతో లేఖ ఇచ్చాను. మరోసారి ఇలాంటి పనులు జరగకూడదనే ఉద్దేశ్యంతో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు జరిగిన ఈ అన్యాయం మరో రచయితకు జరగకూడదు. ఇలా కాపీ చేసేవారిని ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి.. అని చెప్పారు.