శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ కలిస్తే ఆరోగ్యమో, అనారోగ్యమో ఎంతో కొంత కామెడీ అయితే పుడుతుంది అన్న అపోహ బ్రూస్ లీతో తొలగిపోయింది. నిజానికి వీరి ముగ్గురిది సూపర్ హిట్ కలయిక. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల చేత హీరోలకు పోటాపోటీగా ఉండే హాస్యపు సన్నివేశాలను రాసి కొన్ని చిత్రాలను హిట్టు నుండి సూపర్ హిట్టు స్థాయికి తీసుకుపోయిన ఘనత వీరి ముగ్గురిది. అలాంటిది ఎమ్మెస్, ధర్మవరపు లేని లోటు కొట్టివచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరి ఆకస్మిక మరణంతో తెలుగు పరిశ్రమ హాస్య కొరతను అనుభవిస్తోంది.
గత్యంతరం లేక బ్రూస్ లీలో ఎమ్మెస్ చేయాల్సిన ఓ పాత్రను బ్రహ్మాజీతో చేయించడమే కాకుండా ఎలాగోలా మరింత కామెడీని జోడించాలన్న తపనతో బ్రహ్మీ చేత కోతి చేస్థలు చేయించి అబాసుపాలయ్యారు. హ్యాపీగా ఉన్న మంకీ, బాధ పడుతున్న మనకీ, జ్వరంతో మంకీ, ఆకలి మంకీ అంటూ బ్రహ్మీతో నానారకాల ఎక్స్ ప్రెషన్స్ పెట్టించి ప్రేక్షకులను చిత్రవధకు గురి చేసారు. అంతటి మహానటుడి చేత ఇంతటి వెకిలి చేష్టలు చేయించడం ఎంత అసందర్భంగా ఉందొ అంతే అసహ్యంగా కూడా తోచింది. మరి ఎమ్మెస్, ధర్మవరపుల గైర్హాజరుతో వైట్ల, కోన, గోపిల పతనం మొదలయింది అని అనుకోవచ్చేమో.