హీరోయిన్ ఓరిఎంటెడ్ సినిమాలకు తెలుగులో రోజురోజుకీ క్రేజ్ పెరుగుతోంది. అరుంధతితో హీరోయిన్లు కేవలం అందాల అరబోతకే పరిమితం కాదన్న కొత్త థియరీని రూపొందించిన అనుష్క ఆ తరువాత కూడా అదును చిక్కినప్పుడల్లా కథానాయికకు ప్రాముఖ్యతనిచ్చే స్క్రిప్టులను చేస్తూ ఇతర హీరోయిన్లకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచింది. బాక్సాఫీసు ఫలితాన్ని అటుఇటుగా వదిలేసినా అనుష్క మాత్రం కీర్తి ప్రతిష్టలను పెంచుకుంటూ పోతోంది. కాకతీయ సామ్రాజ్యపు వీర నారిగా రుద్రమదేవితో స్వీటీ ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది.
గుణశేఖర్ నిర్మాతగా మారి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎన్నో ఒడిదొడుకులు దాటుకుని విడుదలయి చాలా చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ బడ్జెట్ పరిధులు దాటి యాభై నుండి అరవై కోట్ల వరకు ఖర్చు చేసిన గుణశేఖర్ మొత్తానికి నలభై కోట్లు వసూల్ చేయడానికి కష్టాలు పడుతున్న ఈ చారిత్రక చిత్రంతో ఎంతో కొంత పోగొట్టుకోవడం తధ్యం. మరో కోణంలో నుండి ఆలోచిస్తే ఓ కథానాయిక బేసుడు సినిమాకు నలభై కోట్లు వరకు థియేటర్ల నుండే షేర్ రావడం అనేది గొప్ప విజయంగా వర్ణించవచ్చు. అనుకున్న సమయానికి బ్రూస్ లీ రాకపోయే ఉంటె రుద్రమ విజయయాత్ర నిరాటంకంగా సాగేదే.