చిరంజీవిని మెగాస్టారుగా ఇప్పటికీ కీర్తించడానికి ఒకానొక కారణం ఆయన విలక్షనతతో కూడుకున్న కొంగ్రొత్త కథలను ఎన్నుకోవడమే. న్యాయవ్యవస్థలో ఉరిశిక్షను రద్దు చేసేందుకు చేసిన చిరు ప్రయత్నంగా అభిలాష తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అసలు అటువంటి ఓ కథాంశం ఉన్న నవలను చిత్రంగా తెరకెక్కించాలన్న ప్రయత్నమే హర్షించదగ్గ పరిణామం. అటువంటి భావుకత ఉన్న కథలు ఈరోజుల్లో భూతద్దం పెట్టి వెతికినా కానరావు. కానీ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళంలో ఓ మూవీ ప్రారంభం కాబోతుందన్న వార్త తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించి విశేషం ఏమిటంటే చిరంజీవి టాగూర్ (తమిళ రమణ) కన్నా మునుపే మురుగదాస్ న్యాయవ్యవస్థ చుట్టూ తిరిగే ఓ సంచలనమైన కథాంశంతో స్క్రిప్ట్ రాసుకున్నాడట. సరైన టైం దొరక్క కొంత కాలంగా ఆ స్క్రిప్ట్ మరుగున పడిపోయింది. ఎప్పుడైతే మహేష్ బాబు ఈ కథ నచ్చాడో, మరికొన్ని హంగులు చేర్చి మురుగ అంతా సిద్ధం చేసేసాడు. మహేష్ బాబు కూడా చిరంజీవిలాగా లాయర్ పాత్ర పోషిస్తాడో లేదో తెలియదుగానీ ఖచ్చితంగా చిరంజీవి అభిలాష కథతో ఈ కథకు పోలికలు ఉంటాయని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. సమాజానికి ఉపయోగపడే దర్శకుడిగా మురుగకు, ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించే సత్తా ఉన్న మహేష్ లాంటి ఇద్దరు ఘనాపాటీలు కలిస్తే సంచలనాలు నమోదు కాకుండా ఉంటాయా.