గన్స్ గట్స్ అండ్ లవ్ అంటున్నాడు పవన్‌కళ్యాణ్. సర్దార్ గబ్బర్‌సింగ్ కోసం. అయితే ఆయన ఫ్యాన్ నిఖిలేమో తన సినిమా గన్ను ప్లస్ ఫన్నుతో లోడ్ అయ్యిందని తేల్చేశాడు. పవన్‌కళ్యాణ్ చేతుల మీదుగానే బుధవారం శంకరాభరణం టీజర్ రిలీజ్ అయ్యింది. ఆ టీజర్ ఆకట్టుకొనేలా ఉంది. ఫ్రమ్ ద స్ట్రీట్స్ ఆఫ్ న్యూయార్క్ టు ద గ్యాంగ్స్ ఆఫ్ బిహార్ వరకు కథ నడుస్తున్నట్టు ఆ టీజర్ చెబుతోంది. మిలియన్ డాలర్లు సంపాదించిన ఓ ధనవంతుడి కొడుకుగా నిఖిల్ ఈ సినిమాలో నటించాడు. తండ్రి కష్టపడి నేనూ కష్టపడితే ఇక సుఖపడేది ఎవడ్రా అంటూ ఎంజాయ్ చేసే కుర్రాడిగా నిఖిల్‌ని చూపించారు. అయితే ఓ చిన్న పనికోసం అమెరికా నుంచి బీహార్‌కి వచ్చిన ఆ కుర్రాడు అక్కడ ఎలాంటి ఇబ్బందుల్లో పడిపోయాడు? అక్కడ్నుంచి ఎలా బయటపడ్డాడు? అనే కథతో శంకరాభరణం తెరకెక్కినట్టు అర్థమవుతోంది.
బీహార్‌కి వచ్చేవరకు ఫన్నుతో సాగే కథని ఆ తర్వాత గన్నులతో మలుపు తిప్పినట్టు తెలుస్తోంది. బీహార్‌లోని కిడ్నాప్ ముఠా చేతిలో పడ్డ నాయకానాయికలు అక్కడ్నుంచి ఎలా తప్పించుకొన్నారనే కథతోనే ఈ సినిమాని తెరకెక్కించినట్టు సమాచారం. టీజర్‌లో నిఖిల్‌తో పాటు సప్తగిరి హైలెట్టయ్యాడు. సంపత్, పృథ్వీ, నందిత తదితరులు తళక్కున మెరిశారు. చివర్లో అంజలి అదరగొట్టింది. కబ్ ఆయేగా అస్లీ దివాలి అంటూ గన్నున్ను ముద్దాడుతోంది. సినిమాలో పృథ్వీ పాత్ర హిల్లేరియస్‌గా ఉంటుందట. కోన సినిమాల్లో కామెడీ గ్యాంగ్ హడావుడి మామూలుగా ఉండదు. ఇందులో కూడా సప్తగిరి, పృథ్వీలని బాగా వాడేసినట్టు తెలుస్తోంది. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చడంతో పాటు, చిత్రానికి సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆయన తన పలుకుబడినంతా ఉపయోగించి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. టీజర్‌ని పవన్‌కళ్యాణ్ చేతులమీదుగా విడుదల చేయించిన కోన ట్రైలర్‌ని మాత్రం చరణ్ బ్రూస్‌లీ సినిమాతో విడుదల చేయించాలని ప్లాన్ చేశాడు. మొత్తమ్మీద కోన వెంకట్ వల్ల ఈ సినిమా మరో స్థాయికి వెళుతోంది.