రుద్రమదేవి విడుదలకు ముందు గుణశేఖర్ పరిస్థితి అగమ్య గోచరం. ఆయన్ని ఆ దేవుడే కాపాడాలి అనేవారు. సినిమా విడుదలయ్యేది కూడా కష్టమే అన్నవాళ్లున్నారు. కానీ గుణశేఖర్ పరిస్థితులకు ఎదురొడ్డి... సినిమా కష్టాలు పడి రుద్రమదేవిని రిలీజ్‌కి రెడీ చేశాడు. ఇంతలో అనుకోని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి వరం లభించింది. అదే పన్ను మినహాయింపు. దీంతో గుణకి ఒకింత ఊరట కలిగినట్టయింది. ఇప్పుడు సినిమా కూడా బాగానే వసూళ్లు రాబట్టుకొంటోంది. 40కోట్లకి దగ్గర దగ్గరగా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంతమాత్రాన గుణ సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్టు కాదు. ఇంకా ఇప్పుడొచ్చినన్ని వసూళ్లు రావాలి. అందుకే మరో వారం గ్యాప్ దొరుకుంటే బాగుండేదని అనుకొన్నాడు. కానీ ఆయన కోరిక తీరేలా లేదు. రామ్‌చరణ్ బ్రూస్‌లీ శుక్రవారం వస్తోంది. అది రుద్రమదేవి వసూళ్లకు గట్టి దెబ్బే. ఇలాంటి కష్టాలన్నీ ఉన్నాయి కాబట్టి నిర్మాతగా గుణశేఖర్ గట్టెక్కుతాడో లేదో తెలియదు కానీ... దర్శకుడిగా మాత్రం ఆయన హిట్టయినట్టే. రుద్రమదేవిని తెరకెక్కించిన విధానంపై ప్రశంసలు లభిస్తున్నాయి. గొప్ప ప్రయత్నం అని మెచ్చుకొంటున్నారు. ఇప్పుడు రుద్రమదేవికి కొనసాగింపుగా గుణ తీయాలనుకొన్న ప్రతాపరుద్రుడు సినిమాకి కూడా నిర్మాత దొరికేశాడు.
రుద్రమదేవి సమయంలోనే పార్ట్ 2గా ప్రతాప రుద్రుడు తీస్తానని ప్రకటించాడు గుణశేఖర్. కానీ గుణ ఆర్థిక పరిస్థితి రీత్యా ఆయన ప్రతాపరుద్రుడు తీయడం అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆ సినిమాని కూడా భారీ స్థాయిలోనే తెరకెక్కించాల్సి వుంటుంది కాబట్టి గుణశేఖర్‌లాగా సాహసం చేసే మరో నిర్మాత దొరకడం కష్టం అనుకొన్నారంతా. కానీ ఇప్పుడు దిల్‌రాజు ముందుకొచ్చాడు. రుద్రమదేవిపైన సంతృప్తికరంగా ఉన్న ఆయన ప్రతాపరుద్రుడు స్ర్కిప్టు తయారు చేస్తే.. నేను నిర్మిస్తా అని ఇటీవల ప్రకటించాడు. దీంతో గుణ ఆనందానికి అవధుల్లేవు. దిల్‌రాజు అండ్ టీమ్‌కు బాహుబలి టైపులో ఓ సినిమా చేయాలనే కోరిక ఉంది. ఆ కోరిక ప్రతాపరుద్రుడు రూపంలోనే తీర్చుకొందామని అనుకొంటున్నారట. మరి గుణ దిల్‌రాజుని ఒప్పించేలా స్క్రిప్టు సిద్ధం చేస్తాడో లేదో చూడాలి.
Advertisement
CJ Advs