సరిహద్దుల్లో ఉగ్రవాదుల తూటాలకు బలై వీరమరణం పొందిన బొట్ట సత్యం కుటుంబాన్ని హీరో నాగశౌర్య శుక్రవారం పరామర్శించారు. ఈనెల 5న జమ్మూ కాశ్మీర్ సమీపంలోని కుప్పవాడ ప్రాంతంలోని అంద్వారా వద్ద జరిగిన కాల్పుల్లో విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన బొట్ట సత్యం వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన సత్యం భార్య శ్రీవాణి బొబ్బిలిలోని స్థానిక గొల్లవీధిలో నివాసముంటున్నారు. ఆ ఇంటికి హీరో నాగశౌర్య స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబానికి మేమంతా అండగా ఉంటామన్నారు. ఎప్ప్పుడు ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటానన్నారు. అనంతరం 50 వేల రూపాయలను పిల్లల పేరు మీద పిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఈ సందర్భంగా..
హీరో నాగశౌర్య మాట్లాడుతూ...దేశ రక్షణ కోసం వీర జవాన్ సత్యం... పోరాడి అసువులు బాశారు. అలాంటి వీరుడి కుటుంబాన్ని పరామర్శించడం నా బాధ్యతగా భావించాను. అందుకే కుటుంబ సభ్యుల వద్దకు నేరుగా వెళ్లి ఓదార్చాలని నిర్ణయించుకొని... ఇక్కడికి వచ్చాను. మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే సైనికుల పుణ్యమే. వీర జవాను కుటుంబానికి నేను చేసింది చిరు సాయమే. మా కుటుంబం స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. చిత్ర పరిశ్రమ ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. అని అన్నారు.