జ్ఞాన్, సూర్య శ్రీనివాస్ హీరోలుగా ఒక రొమాంటిక్ ప్రేమకథ ఫేం ప్రియాంక పల్లవి హీరోయిన్‌గా పరంధ్ కళ్యాణ్ దర్శకత్వంలో రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రైజింగ్ టీమ్ నిర్మిస్తున్న చిత్రం నేనొస్తా. చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టైటిల్ లోగోను ఇటీవల దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ఆవిష్కరించి... టైటిల్ మరియు లోగో చాలా బాగుందని, కొత్త వాళ్లు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశీస్పులు అందజేశారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. మా చిత్రం లోగోను దర్శక దిగ్గజం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు. ఇదొక థ్రిల్లర్ సినిమా. ఆద్యంతం ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని మా నమ్మకం. హైదరాబాద్, వికారాబాద్, నర్సాపూర్, వైజాగ్, జడ్చర్ల తదితర అందమైన లొకేషన్లలో నలభై రోజుల పాటు క్వాలిటీకి వెనకాడకుండా హై స్టాండార్డ్స్‌లో చిత్రాన్ని పూర్తి చేశాము. ఇందులో ఐదు పాటలున్నాయి. బాహుబలి సిస్టర్స్ మౌనిమ, దామిని పాడిన పాట హైలెట్‌గా నిలుస్తుంది. పాటలన్నీ చిత్రీకరణ పూర్తయ్యాయి. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో నిర్మాణానంతర కార్యక్రమాలు జురుపుకుంటోంది. త్వరలో ట్రైలర్‌ని లాంచ్ చేస్తాము.. అన్నారు.
జ్ఞాన్, ప్రియాంక పల్లవి, సూర్య శ్రీనివాస్, సంధ్యా జనక్, బిహెచ్‌ఇఎల్ ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు, రచనా సహకారం : బాషా మజహర్, ఎడిటర్ : ఎస్.జె.శివకిరణ్, సంగీతం : అనురాగ్ వినీల్, ఫొటోగ్రఫి : శివారెడ్డి, నిర్మాణం : రైజింగ్ టీమ్ , దర్శకత్వం : పరంధ్ కళ్యాణ్.