Advertisement
Google Ads BL

ఏడిద నాగేశ్వరరావు ఇక లేరు


తెలుగులో హాఫ్ బీట్ సినిమా అని ధైర్యంగా చెప్పగలిగిన సినిమాల్లో తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన చిత్రం శంకరాభరణం. సంగీత, నృత్య ప్రధాన చిత్రాలే కాదు...ఆడియన్స్ ను ఆహ్లాదపరచే సినిమా నిర్మాణ సంస్ధగా ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది పూర్ణోదయా మూవీస్. కమర్షియాల్టీ కోసం కళను బలిపెట్టనవసరం లేదని ప్రూవ్ చేసిన చిత్రాలు అనేకం పూర్ణోదయా సంస్ధ నుంచి వచ్చాయి. పూర్ణోదయ ప్రిన్స్ పల్ ఏడిద నాగేశ్వర్రావు కన్నుమూశారు.  ఓ సారి వారి కళాయాత్రను గుర్తు చేసుకుందాం. నటుడు అవుదామనుకుని మద్రాసొచ్చి...ఆ తర్వాత డబ్బింగ్ తో సహా అనేక పనులు చేస్తూ సెటిలై...కొందరు మిత్రుల తోడ్పాటుతో నిర్మాతగా మారారు ఏడిద నాగేశ్వర్రావు. తీసింది తక్కువ సినిమాలే అయినా...కలకాలం చెప్పుకునే చిత్రాలు తీశారాయన. కళాత్మక చిత్ర నిర్మాతగా తెలుగువారికి ఎప్పటికీ గుర్తుండిపోయే చరిత్ర ఆయనది.
కాకినాడ పి.ఆర్ కాలేజ్ లో చదువుతూ రాఘవ కళాసమితి ఏర్పాటు చేశారు ఏడిద నాగేశ్వర్రావు. ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ కూడా అందులో భాగస్వామి. రాజేంద్రప్రసాద్ సినిమాల్లోకి వెళ్లాక ఆయన పిలుపుతోనే మద్రాసు చేరారు ఏడిద. నటుడు కావాలని వెళ్లి... ఆకాశవాణి నుంచి...సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల దాకా అన్నీ చేశారు. చివరకు డబ్బింగ్ కూడా చెప్పారు. చాలా సినిమాల్లో పేరు లేని పాత్రల్లో నటించారు కూడా.  మకాం హీరో హరనాథ్ ఇంట్లో. సిరిసిరిమువ్వ చిత్రంతో దశ తిరిగింది.
తూర్పుగోదావరి జిల్లా నుంచి సినిమాల మీద ఇంట్రస్ట్ తో భాస్కరరెడ్డి, రామకృష్ణారెడ్డి మరో ఇద్దరు స్నేహితులు మద్రాసొచ్చారు. ముందు అనుభవం కోసం ఓ డబ్బింగ్ మూవీ తలకెత్తుకుందాం అనుకున్నారు. ఏడిద గైడెన్స్ లో శ్రీ వేంకటేశ్వర కళ్యాణం తమిళ సినిమా తెలుగులోకి డబ్ చేశారు. లాభాలొచ్చాయి. ఈ సారి స్ట్రెయిట్ మూవీ అనుకున్నారు. ఏడిదను వర్కింగ్ పార్ట్ నర్ గా పావలా వాటాకు తీసుకున్నారు. అలా వచ్చిన సినిమానే సిరిసిరిమువ్వ. సిరిసిరిమువ్వలో వచ్చిన లాభాలతో పూర్ణోదయా మూవీస్ అనే సంస్ధను ఏర్పాటు చేసి కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో తాయారమ్మ బంగారయ్య తీశారు ఏడిద. ఆ సినిమాకూడా అద్భుతమైన విజయం సాధించింది. దీంతో సిరిసిరిమువ్వ డైరక్టర్ విశ్వనాథ్ చెప్పిన కథ నచ్చి శంకరాభరణం సినిమా తీశారు. హీరోగా నాటకాల రోజుల్లో తనకన్నా సీనియర్ అయిన జే.వి.సోమయాజులును తీసుకున్నారు. వేటగాడు, డ్రైవర్ రాముడు దుమ్ముదులిపేస్తున్న రోజుల్లో శంకరాభరణం రిలీజ్ అయింది. విజయం సాధించి బడా స్టార్స్ గుండెల్లో గుబులు రేపింది. శంకరాభరణం తర్వాత యూత్ ఫుల్ లౌస్టోరీ సీతాకోకచిలుక తీశారు ఏడిద నాగేశ్వర్రావు. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. భారతీరాజా అప్పటికే తెలుగులో కొత్తజీవితాలు తీశారు. కానీ సక్సస్ చూసిన సినిమా మాత్రం సీతాకోకచిలుకే. ఈ సినిమా తమిళ వర్షన్ స్వీయనిర్మాణంలో తీసిన రాజా తెలుగు మాత్రం పూర్ణోదయాకు చేశారు. అలా పూర్ణోదయాలోకి ఇళయరాజా ప్రవేశించారు.
సీతాకోకచిలుక తర్వాత పూర్ణోదయా బ్యానర్ మీద నిర్మాణమైన చిత్రం సాగరసంగమం. శంకరాభరణం తర్వాత విశ్వనాథ్ పూర్ణాదయాకు చేస్తున్న చిత్రం కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హైగానే ఉన్నాయి. సంగీతం ఇళయరాజా అని ప్రకటించగానే విశ్వనాథ్ అభిమానులు ఒక్కసారి ఖంగుతిన్నారు. మహదేవన్ లేకుండా విశ్వనాథ్ చిత్రమా అనుకున్నారు. సినిమా ఆడియో విడుదలైంది. పాటలు విని మొదట పెదవి విరిచిన వారే మళ్లీ మళ్లీ విన్నారు. బాగున్నాయన్నారు.
ఇళయరాజా పూర్ణోదయాలో కంటిన్యూ అయ్యారు. సాగరసంగమం తర్వాత వచ్చిన సితార, స్వాతిముత్యం చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించారు. సితార సినిమాకు నిండుతనం తెచ్చింది ఇళయరాజా సంగీతమే. ఈ విషయం సాక్షాత్తు వంశీనే అనేక సార్లు చెప్పారు. రీరికార్టింగ్ తర్వాత సితారకీ ముందు సితారకీ చాలా తేడా ఉందనేవారు. సితార కోసం రాజా స్వరపరచిన వెన్నెల్లో గోదారి అందం పాటతో మరోసారి జాతీయ పురస్కారం అందుకున్నారు ఏడిద నాగేశ్వర్రావు.
స్వాతిముత్యం తర్వాత పూర్ణోదయాలో వచ్చిన విశ్వనాథ్ సినిమా స్వయంకృషి. మెగాస్టార్ చిరంజీవి తో తెరకెక్కిన ఈ చిత్రానికి రమేష్ నాయుడుతో సంగీతం చేయించుకున్నారు విశ్వనాథ్.  విశ్వనాథ్ రమేష్ నాయుడు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రమే రమేష్ నాయుడు చివరి చిత్రంగా మారడం విషాదం. అయితే సంగీత సాహిత్యాలకు పెద్ద పీట వేసే పూర్ణోదయా సంస్ధ పేరు నిలబెట్టే సంగీతాన్నే అందించారు రమేష్ నాయుడు.
సీతాకోక చిలుకలోనే నటుడుగా మెరిసిన ఏడిద నాగేశ్వర్రావు కొడుకు రాజా హీరోగా స్వరకల్పన తీశారు. మిస్సమ్మ తరహా కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి  ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ తో సంగీతం చేయించుకున్నారు ఏడిద నాగేశ్వర్రావు. అందులో వెన్నెలకంటితో ఓ అద్భుతమైన ప్రయోగం చేయించారు. సరిగమపదని సప్తస్వరాలు మాత్రమే వాడుతూ అర్ధవంతంగా పాటను ముగించారు.
చిరంజీవి, విశ్వనాథ్ ల కాంబినేషన్ లోనే జంధ్యాలను నటుడ్ని చేస్తూ తీసిన ఆపద్భాంధవుడు పూర్ణోదయాలో కాస్త ఎక్కువ దెబ్బేసిన చిత్రం. కీరవాణితో సంగీతం చేయించుకున్నారు.
వాహినీ, అన్నపూర్ణ సంస్ధల తర్వాత కళాత్మక విలువలతో సినిమాలు నిర్మించాలనే కమిట్ మెంట్ తో ముందడుగు వేసిన నిర్మాత ఏడిద నాగేశ్వర్రావు ధన్యజీవి. చిరంజీవి కోడి రామకృష్ణలతో సినిమా తీయాలని ఆపద్భాంధవుడి తర్వాత అనుకున్నారుగానీ అది రూపు దాల్చలేదు. ఆ తర్వాత నెమ్మదిగా సీనియర్ నిర్మాతగా ఉండిపోయారు. ఆయన కన్నుమూయడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటే.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs