తొలివలపుతో హీరోగా పరిచయమై ఆ తర్వాత జయం చిత్రంతో విలన్ అవతారమెత్తి వర్షం, నిజం చిత్రాల్లో కూడా విలన్‌గానే కొనసాగిన గోపీచంద్‌కి ఆ మూడు సినిమాలు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత మళ్ళీ హీరోగా టర్న్ అయి చేసిన యజ్ఞం పెద్ద హిట్ అయింది. తను విలన్‌గా చేసిన సినిమాల టైటిల్స్‌లో చివర సున్నా వుంది. తనకి హీరోగా బ్రేక్ ఇచ్చిన సినిమా టైటిల్‌లో కూడా అదే వుంది. అదే తనకి హిట్స్‌ని తెచ్చిపెట్టేది అదే అనుకున్నాడో ఏమోగానీ తన ప్రతి సినిమా టైటిల్‌లో సున్నా వుండేలా జాగ్రత్త పడుతున్నాడు. హీరోగా అతను చేసిన సినిమాలు రణం, లక్ష్యం, శౌర్యం, శంఖం, సాహసం, లౌక్యం.. ఇలా ప్రతి టైటిల్‌లోనూ సున్నా వుంది. విచిత్రం ఏమిటంటే ఇలాంటి టైటిల్స్‌తో వచ్చిన సినిమాలే గోపీచంద్ కెరీర్‌లో హిట్లుగా, ఏవరేజ్ మూవీస్‌గా నిలిచాయి. మిగతా సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో సినిమాకి కూడా అలాంటి టైటిల్‌నే రిజిష్టర్ చేశారు. మొదటి నుంచీ గోపీచంద్‌తోనే సినిమాలు చేస్తూ వస్తున్న భవ్య క్రియేషన్స్ అధినేత వి.ఆనందప్రసాద్ తమ బేనర్‌లో చేస్తున్న కొత్త సినిమాకి సౌఖ్యం అనే టైటిల్‌ని రిజిష్టర్ చేశారు. యజ్ఞం డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రోగ్రెస్‌లో వుంది. గోపీచంద్‌కి, రవికుమార్ చౌదరికి పెద్ద బ్రేక్ ఇచ్చిన యజ్ఞం తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.