త్రిష, గణేష్ వెంకటరామన్ ప్రధాన పాత్రల్లో రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ లో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నాయకి. గోవి దర్శకుడు. ఈ చిత్ర విశేషాలు తెలిపేందుకు చిత్రబృందం గురువారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..
గిరిధర్ మాట్లాడుతూ.. ఇది మా బ్యానర్ లో రెండవ సినిమా. త్రిష గారి మేనేజర్ గా 5 నుండి 6 సంవత్సరాల వరకు పని చేసాను. అలాంటిది ఆవిడతో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా రెండవ సినిమా ఓ థ్రిల్లర్ జోనర్ లో చేయాలనుకున్నాను. కాని జోవి నాకు ఈ సినిమా కథ చెప్పగానే చాలా నచ్చింది. ఓ హారర్ స్టొరీ ఇది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. తమిళంలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసేసాం. ప్రస్తుతం వస్తున్న హారర్ చిత్రాల్లా కాకుండా ఈ కథ కొత్తగా ఉంటుంది. త్రిష గారు 13 సంవత్సరాల కెరీర్ లో చేయలేని క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో చేసారు. మా మొదటి చిత్రాన్ని(లక్ష్మి రావే మా ఇంటికి) ఆదరించినట్లుగానే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను.. అని చెప్పారు.
గణేష్ వెంకటరామన్ మాట్లాడుతూ.. ఆకాశమంత, ఈనాడు చిత్రాల తరువాత మంచి పాత్రల కోసం వెయిట్ చేసాను. గిరిధర్ గారు నాకు ఎనిమిది సంవత్సరాలుగా తెలుసు. ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది. త్రిష నాకు ఎప్పుడూ స్పెషల్. నా మొదటి సినిమా హీరోయిన్ ఆమె. ఆకాశమంత చిత్రంలో మా జంటకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మా పెయిర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ బాగా పెరిగాయి. గోవితో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇదొక హారర్ కామెడీ సినిమా. పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
సుష్మ రాజ్ మాట్లాడుతూ.. త్రిష గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నేను కనిపిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్.. అని చెప్పారు.
సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ఇదొక కొత్త సబ్జెక్టు. ఎవరు టచ్ చేయని ఓ కొత్త లైన్ ను డైరెక్టర్ గారు ఈ సినిమాలో చుపించబోతున్నారు.. అని చెప్పారు.
త్రిష మాట్లాడుతూ.. గిరిధర్ గారు నాకు మంచి ఆప్తులు. మొదటిసారి గోవి నాకు ఈ కథ చెప్పినప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ తో నా దగ్గరకి వచ్చారు. మొదటి ఐదు నిమిషాలు కథ వినగానే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. నాకిష్టమైన హారర్ జోనర్ సినిమా ఇది. నా కెరీర్ లో హారర్ సినిమా ఇప్పటివరకు ఎటెంప్ట్ చేయలేదు. ఈ సినిమా ఎక్కువశాతం 1980 లో జరుగుతుంటుంది. గోవి గారు బెస్ట్ డైరెక్టర్. నేను డైరెక్టర్ చెప్పినట్లుగానే నటిస్తాను. తమిళంలో ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. గణేష్ సినిమాల కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తాడు.. అని చెప్పారు.
దర్శకుడు గోవి మాట్లాడుతూ.. లవ్ యు బంగారం సినిమాకు అందరు కొత్త వాళ్ళతో పని చేసాను. కాని ఈ సినిమాకు మాత్రం సీనియర్ యాక్టర్స్ తో పని చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సంవత్సరంన్నర పాటు ఈ కథ రాసుకున్నాను. హారర్ సినిమా డిఫరెంట్ గా ఉండాలనుకున్నాను. త్రిష గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. టాప్ హీరోయిన్ తో సినిమా చేయాలని ఈ కథ రెడీ చేసుకున్నాను. నా అభిమాన నటితో పని చేయడం సంతోషంగా ఉంది. త్రిష గారిని బాగా ఎలివేట్ చేసే క్యారెక్టర్ ఇది. రెండు వేరియేషన్స్ లో ఈ సినిమాలో కనిపిస్తారామే. ఆరు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసాను. త్రిష గారి లుక్ కోసం నాలుగు నెలలుగా ట్రై చేసాం. ఈ పోస్టర్స్ చూసి రాజమౌళి గారు ట్వీట్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. రఘు కుంచె మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో త్రిష గారితో ఓ పాట పాడించాలనుకుంటున్నాం.. అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మాధవీలత, జయప్రకాశ్, జీవి తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కళ: కె.వి.రమణ, కూర్పు: గౌతం రాజు, పాటలు: భాస్కర్ భట్ల, సంగీతం: రఘు కుంచె, ఫోటోగ్రఫీ: జగదీశ్ చీకటి, నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: గోవి.