సినిమారంగంలో ఎడిటర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్నారు. ఆయన నటించిన చిత్రం నన్నువదలి నీవు పోలేవులే!. ఇందులో కోలా బాలకృష్ణ సరసన వామిక కథానాయికగా నటించింది. బీప్‌టోన్ స్టూడియోస్ పతాకంపై కంచర్ల పార్థసారధి సమర్పణలో కోలా భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ఇటీవలనే చిత్రీకరణ పూర్తికాగా ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా..
నిర్మాత కోలా భాస్కర్ మాట్లాడుతూ.. ప్రేక్షకుడి హృదయాన్ని స్పృశించే సున్నితమైన కథలను తనదైన శైలిలో సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించి వాణిజ్యపరంగానూ అద్భుతమైన విజయాలను అందించిన దర్శకుడిగా శ్రీరాఘవకు ఓ ప్య్రత్యేక గుర్తింపు ఉంది. యూత్‌ఫుల్ ప్రేమకథాంశంతో రూపొందిన ఈ చిత్రం కూడా ఆ చిత్రాల కోవలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. క్లైమాక్స్ కూడా చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తుంది. హైదరాబాద్, రాజమండ్రి, చెన్నై, కేరళలోని మూనార్, చేలకుడి తదితర లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ చేశాం. త్వరలో ఆడియోను, ఇదే నెలాఖరులోగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. అని చెప్పారు.
చిత్ర సమర్పకుడు కంచర్ల పార్థసారధి మాట్లాడుతూ.. కథానాయకుడు కోలా బాలకృష్ణ ఎంతో అనుభవం కలిగిన నటుడిలా తన పాత్రలో చక్కటి అభినయాన్ని కనబరిచారు. తెలుగుతెరపై ఇప్పటివరకు ఇటువంటి కథాంశంతో ఏ చిత్రమూ రాలేదు. లోగడ యూనివర్శల్ కంపెనీకి ఆడియో ఆల్బమ్‌ను రూపొందించి, అందరిదృష్టిని ఆకర్షించిన అమృత్ ఈ చిత్రానికి అందించిన సంగీతం ఓ హైలైట్‌గా నిలుస్తుందని.. చెప్పారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీరాఘవ, ఛాయాగ్రహణం: శ్రీధర్, సంగీతం: అమృత్, పాటలు: అనంతశ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.మణికుమార్, సమర్పణ: కంచర్ల పార్థసారధి, నిర్మాత: కోలా భాస్కర్, దర్శకత్వం: గీతాంజలి శ్రీరాఘవ.