సువర్ణ క్రియేషన్స్ పతాకంపై పి.డి.రాజు ప్రధాన పాత్రలో జె.జాన్ బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న సినిమా తొలి కిరణం. ఈ చిత్రాన్ని సోమవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి స్వర్ణజిత్ సేన్ క్లాప్ కొట్టగా, జక్కుల బెనహర్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఏ.జె.ప్రకాషరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
దర్శకుడు జె.జాన్ బాబు మాట్లాడుతూ.. లోక రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ప్రేమ, త్యాగాలతో కలిపి ఆయన జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో ఎనిమిది పాటలుంటాయి. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.
పి.డి.రాజు మాట్లాడుతూ.. జీసస్ పాత్ర నా కెరీర్ లో మరో అధ్బుతమైన గీటు రాయిగా నిలుస్తుంది. ఈ చిత్రంలో నటించడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.. అని చెప్పారు.
సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ.. చాలా కాలంగా జీసస్ చిత్రానికి సంగీతం అందించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి చిత్రాలకు సంగీతం సమకూర్చినప్పుడే మన ప్రతిభ ఏంటనేది తెలుస్తుంది. ఈ చిత్రంలో ఎనిమిది పాటలకు అధ్బుతమైన బాణీలు కుదిరాయి.. అని చెప్పారు.
నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 15 వ తేదీ నుండి రామోజీ ఫిలిం సిటీలో, రెండవ షెడ్యూల్ ఇజ్రాయెల్ దేశం, గోవా తదితర ప్రాంతాల్లో చిత్రీకరించి టాకీ పార్ట్ పూర్తి చేసి డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తాం.. అని చెప్పారు.
ఈ చిత్రానికి కథ-పాటలు: రెవరెండ్ టి.ఎ. ప్రభుకిరణ్, రచన సహకారం:వి.ఎం.ఎం.ప్రవీణ్, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: మురళీకృష్ణ, ఎడిటింగ్: వినయ్, నిర్మాత: టి.సుధాకర్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జె.జాన్ బాబు.