జూలై, ఆగస్ట్ నెలల్లో పెద్ద సినిమాల హవా బాగా నడిచింది. జూలై 10న బాహుబలి రిలీజ్ బిగ్గెస్ట్ హిట్ అవడంతో ఆడియన్స్ చిన్న సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయినా ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో తెలియలేదు. బాహుబలి తర్వాత రిలీజ్ అయిన మరో పెద్ద సినిమా శ్రీమంతుడు కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ సినిమా తర్వాత విడుదలైన రాజ్ తరుణ్, అవికా గోర్‌ల సినిమా చూపిస్త మావ ఒక్కటే చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది. గత శుక్రవారం రిలీజ్ అయిన మరో పెద్ద సినిమా కిక్2 ప్రేక్షకుల్నే కాదు, బయ్యర్లను, డిస్ట్రిబ్యూటర్లను కూడా నిరాశ పరిచింది. ఇక సెప్టెంబర్ 4 నుంచి యంగ్ హీరోల సినిమాలు వరసగా రిలీజ్ కాబోతున్నాయి.
సెప్టెంబర్ 4న మంచు విష్ణు డైనమైట్, విశాల్ కొత్త సినిమా జయసూర్య, సెప్టెంబర్ 11న నితిన్ హీరోగా గౌతమ్ మీనన్ నిర్మించిన కొరియర్ బాయ్ కళ్యాణ్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన భలే భలే మగాడివోయ్, వరుణ్‌తేజ్‌తో క్రిష్ చేసిన కంచె, నిఖిల్ కొత్త సినిమా శంకరాభరణం..ఇలా సెప్టెంబర్, అక్టోబర్ నెలలు పూర్తిగా యంగ్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. దసరా పండగ వరకు ఈ యంగ్ హీరోల సందడి కొనసాగుతుంది. దసరాకి ఎలాగూ పెద్ద సినిమాల రిలీజ్‌లు వుండనే వుంటాయి. కొత్త కాన్సెప్ట్‌లతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యడానికి రెడీ అవుతున్న ఈ యంగ్ హీరోలు ఎంత వరకు ఆడియన్స్‌ని మెప్పిస్తారో, ఏ రేంజ్ విజయాలు సాధిస్తారో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.