కులమతవర్గములకు అతీతంగా అందరూ భగవంతుని పూజించి, భగవంతుని దివ్యానుగ్రహం పొందవచ్చు అని లోకమునకు చాటిన జగద్గురువులు భగవద్రామానుజులు. భగవద్రామానుజుల వారు ఆదిశేషాంశ సంభూతులు. భూలోకంలో ఉండే జనులందరికీ మోక్షం ప్రసాదించడం కోసం శ్రీమన్నారాయణుని దివ్యాజ్ఞతో స్వయంగా ఆదిశేషులే భగవద్రామానుజులుగా తుండరీమండలంలో శ్రీ పెరుంబుదూరు గ్రామంలో అవతరించి కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ఎన్నో సంస్కరణలు గావించిన మహానుభావులు భగవద్రామానుజులు. ఈయన సహస్రాబ్ధి ఉత్సవాల సందర్భంగా అపరరామానుజులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామివారు శంషాబాద్‌లో 200 అడుగుల రామానుజ విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు.
అదే విధంగా శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీరామచంద్ర రామానుజ జీయరు స్వామివారు రామానుజుల వారి వైభవాన్ని ప్రజలందరూ తెలుసుకొనే విధంగా ''సంఘసంస్కర్త భగవద్రామానుజులు'' అనే చలనచిత్రాన్ని అమృత క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చలనచిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ పట్టణంలో జూలై 30వతేది హైటెక్‌సిటి, మాదాపుర్ శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామివారి శ్రీ హస్తముల ద్వారా సీడీల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గోవిందదాసవాహిన సభ్యులు, అనంతశ్రీ స్వామివారు, స్వామివారి ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ డి. కళ్యాణ చక్రవర్తి, శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠం అధ్యక్షులు ఇందుకూరి ప్రసాదరామమోహన్‌రాజు, అంజయ్య యాదవ్, పైడా నిర్మాత జమునారెడ్డి, దర్శకురాలు మంజుల సూరోజు, గోవిందదాసవాహిని అధ్యక్షులు జక్కారఘనందన్ రెడ్డి, పీఠ ఉపాధ్యక్షులు శ్రీమాన్ అల్లూరి నారాయణ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
శ్రీశ్రీశ్రీ అనంత శ్రీ విభూషిత శ్రీరామచంద్ర జీయరు స్వామి మాట్లాడుతూ "మన జగద్గురువైన రామానుజాచార్యులు అవతరించి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన జీవిత చరిత్రను లోకానికి తెలియబరచడానికి ఒక చలన చిత్రంగా రూపొందిస్తున్నారు. వెయ్యి సంవత్సరాల క్రితమే ప్రతి వ్యక్తి కూడా మోక్షానికి అర్హులే అని ఆయన గురువు చెప్పిన మాటలను ప్రపంచానికి చాటి చెప్పాడు భగవధ్రామానుజులు. ఉదారమైన మనస్తత్వం గల వ్యక్తి . ఆనాడే హరిజనులకు ఆలయ ప్రవేశం కలిపించి సామ్యవాది, సంఘసంస్కర్త అనిపించుకొని ఈరోజు చాలా మందికి ఆదర్శవంతులుగా నిలిచారు. భక్తి ఉద్యమాన్ని లోకమంతా వ్యాప్తి చెందించిన వ్యక్తి. ఈరోజుల్లో ప్రతి వ్యక్తికి రోడ్ల మీద విగ్రహాలు కట్టించేస్తున్నారు. కాని ఓ మహోన్నతమైన వ్యక్తయిన రామానుజులుకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి విగ్రహ ప్రతిష్ట జరగలేదు. ఆయన గౌరవార్ధం 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ' అనే 200 అడుగులు గల రామానుజుల విగ్రహాన్ని శంషాబాద్ లో ప్రతిష్టించబోతున్నాం" అని చెప్పారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి మాట్లాడుతూ "జీవితంలో బాగుపడాలనుకునే ప్రతి వ్యక్తి ఒకరి నుండి స్పూర్తిని పొందుతారు. శ్రీరాముడు, కృష్ణుడు వంటి దేవుని అవతారాలు సైతం వారి గురువుల నుండే అన్ని నేర్చుకున్నారు. గురువు లేనిదే మనిషి బ్రతుకుకు అర్ధం ఉండదు. అలాంటి గురువులందరికీ మార్గదర్శకులు భగవధ్రామానుజులు. ఆయన జీవిత చరిత్రను తెలియబరచడానికి ఓ మాస్ మీడియా అయిన సినిమాను ఎన్నుకొని లోకానికి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది. అనంత శ్రీ స్వామి వారు ఇలా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారని చెప్పినపుడు చాలా సంతోషంగా అనిపించింది. జగన్నాధుడికి గురువు అయిన వారు రామానుజులు. దేవుడు అనేవాడు ఒక్కడే అని చెప్పాడు. 102 సంవత్సరాల వయస్సులో తిరుపతికి వెళ్లి ఆలయం అనేది ఎలా ఉండాలో చెప్పాడు. మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో నియమాలు చెప్పాడు. కులాలను వేరు చేయాల్సిన అవసరం లేదని అందరు కలిసిమెలసి, ప్రకృతిలో మమేకమై బ్రతకాలని చెప్పిన వ్యక్తాయన. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించట్లేదు. మంచి ప్రధానమంత్రి వచ్చారు కాబట్టి మన దేశం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని ఆశిస్తున్నాను. పుట్టుకతో ఎవరు అంటరానివారు కాదని అందరిని ఒకేలా చూడాలని చెప్పి సమతామూర్తయ్యాడు. వ్యక్తిని ఎలా గౌరవించాలో చెప్పాడు. విగ్రహంలో దేవుడుని చూడగలిగాడు కాబట్టి ఆలయాలు సమాజానికి కేంద్రమని అవి బావుంటే సమాజం బావుంటుందని చెప్పాడు. అందుకే సంఘసంస్కర్త కాగలిగాడు. జాతికి నిర్దేశం చేసిన మహనీయుడు గురించి ''సంఘసంస్కర్త భగవద్రామానుజులు'' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలకు నా అభినందనలు" అని చెప్పారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయరు స్వామి మాట్లాడుతూ "ఈ ఆడియో పరమ గురువు యొక్క జీవితాన్ని లోకానికి చాటి చెప్పే సంగీత మాలిక. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను" అని చెప్పారు.
దర్శకురాలు మంజుల సూరోజు మాట్లాడుతూ "ఒకే వేదికపై ఇంతమంది స్వామీజీలను చూస్తుంటే రామానుజులు గారిని చూసినట్లుగానే అనిపిస్తుంది. హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించిన సంఘసంస్కర్త భగవద్రామానుజులు జీవితాన్ని చిత్రంగా తెరకెక్కించనున్నాం. వారు చేసిన కార్యక్రమాలే ఈ చిత్రానికి ప్రధాన అంశాలు. తోట వెంకటరమణ గారు అధ్బుతమైన ఫోటోగ్రఫీ అందించారు. పి.జె. నాయుడు గారి మ్యూజిక్ చిత్రానికి ప్లస్ అవుతుంది" అని చెప్పారు.
గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ "ఈ చిత్రంలో శ్రీమన్నారాయణ పాత్రలో నటించిన అవకాసం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.
సూర్యభగవాన్, అనురాగ్, అన్నపూర్ణమ్మ, అశోక్‌కుమార్, రాజశ్రీ, సౌజన్య, రజిత, గిరి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి కెమెరా: తోట వెంకటరమణ, సంగీతం: పి.జె. నాయుడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బిఎస్‌సి చారి, నిర్మాత: జమునారెడ్డి, దర్శకురాలు: మంజుల సూరోజు.