వంద కోట్ల క్లబ్బులోకి తొలిసారిగా టిక్కెట్ కొనుక్కున్న తెలుగు బాహుబలి అసలైన సంచలనాలకు వేదికైంది. తెలుగు సినిమా వాణిజ్య పరంగా ఎంతలా విస్తరిస్తోంది అన్నది కళ్ళకు కట్టినట్టు చూపిన బాహుబలి తరహాలోనే ఇపుడు శ్రీమంతుడు కూడా బయలుదేరాడు. మహేష్ బాబుకున్న స్టార్ చరిష్మా, మార్కెట్ వ్యాల్యూ ప్రకారం చూస్తే శ్రీమంతుడు ఎంత కాదన్నా యాభై నుండి అరవై కోట్లు వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ప్రీమియర్ షోలు వేసేసి, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మాత్రమే కాకుండా తమిళ నాట, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా శ్రీమంతుడికి భారీ కలెక్షన్స్ సేకరించే పనిలో నిర్మాతలు తలమునకలయ్యారు. ఓవర్సీస్ అంతటా మహేష్ గాలి ఎంతలా వీస్తుందో మనకు తెలియనిది కాదు. అందుకే, ఎలాగైనా శ్రీమంతుడును బాహుబలి దరిదాపుల్లోకి తీసుకెళ్ళే ప్రణాళికలు కూడా రచిస్తున్నారు మహేష్ బాబు వీరాభిమానులు.
బడ్జెట్ పరంగా లెక్కలేస్తే బాహుబలి రెండు వందల కోట్లకు, శ్రీమంతుడు యాభై కోట్లకు పొంతనలేదు గానీ మహేష్ బాబుకు తప్పకుండా రాజమౌళి, ప్రభాస్ రాజుల కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోవింగ్ ఉన్న విషయాన్ని మనం మరవకూడదు. ఈ అభిమానం కాస్తా ఉప్పెనలా మారి థియేటర్ల మీద విరుచుకు పడిందంటే ఎంతటి రికార్డులైనా కొట్టుకుపోవాల్సిందే. శ్రీమంతుడుతో అదే జరిగితే మహేష్ బాబుకు ఇక తిరుగుండదు.