కులమతవర్గములకు అతీతంగా అందరూ భగవంతుని పూజించి, భగవంతుని దివ్యానుగ్రహం పొందవచ్చు అని లోకమునకు చాటిన జగద్గురువులు భగవద్రామానుజులు. భగవద్రామానుజుల వారు ఆదిశేషాంశ సంభూతులు. భూలోకంలో ఉండే జనులందరికీ మోక్షం ప్రసాదించడం కోసం శ్రీమన్నారాయణుని దివ్యాజ్ఞతో స్వయంగా ఆదిశేషులే భగవద్రామానుజులుగా తుండరీమండలంలో శ్రీ పెరుంబుదూరు గ్రామంలో అవతరించి కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ఎన్నో సంస్కరణలు గావించిన మహానుభావులు భగవద్రామానుజులు. ఈయన సహస్రాబ్ధి ఉత్సవాల సందర్భంగా అపరరామానుజులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామివారు శంషాబాద్‌లో 200 అడుగుల రామానుజ విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు.
అదే విధంగా శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీరామచంద్ర రామానుజ జీయరు స్వామివారు రామానుజుల వారి వైభవాన్ని ప్రజలందరూ తెలుసుకొనే విధంగా ''సంఘసంస్కర్త భగవద్రామానుజులు'' అనే చలనచిత్రాన్ని అమృత క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చలనచిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ పట్టణంలో జూలై 30వతేది సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు హైటెక్‌సిటి, మాదాపుర్ శిల్పకళావేదికలో జరుగుతుంది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా అపర రామానుజులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయరు స్వామివారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విచ్చేసి వారి శ్రీ హస్తముల ద్వారా సీడీలను ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గోవిందదాసవాహిన సభ్యులు, అనంతశ్రీ స్వామివారు, స్వామివారి ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ డి. కళ్యాణ చక్రవర్తి, శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠం అధ్యక్షులు ఇందుకూరి ప్రసాదరామమోహన్‌రాజు, నిర్మాత జమునారెడ్డి, దర్శకురాలు మంజుల సూరోజు, గోవిందదాసవాహిని అధ్యక్షులు జక్కారఘనందన్ రెడ్డి, పీఠ ఉపాధ్యక్షులు శ్రీమాన్ అల్లూరి నారాయణ రాజులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో..
ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ డి. కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ "కులమత వర్గాలకు అతీతంగా అందరు భగవంతుడ్ని పూజించాలని లోకానికి చాటి చెప్పిన గొప్ప సంఘసంస్కర్త భగవద్రామానుజులు. ఆయన చరిత్రను అందరికి తెలియబరచాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఎనిమిది మంది పీఠాధిపతులు ఒకే వేదికపై ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. జూలై 30వ తేది ఆడియోను విడుదల చేసి శ్రావణ మాసంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.
దర్శకురాలు మంజుల సూరోజు మాట్లాడుతూ "హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించిన సంఘసంస్కర్త భగవద్రామానుజులు జీవితాన్ని చిత్రంగా తెరకెక్కించనున్నాం. వారు చేసిన కార్యక్రమాలే ఈ చిత్రానికి ప్రధాన అంశాలు. తోట వెంకటరమణ గారు అధ్బుతమైన ఫోటోగ్రఫీ అందించారు. పి.జె. నాయుడు గారి మ్యూజిక్ చిత్రానికి ప్లస్ అవుతుంది" అని చెప్పారు.
మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ "ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
నిర్మాత జమునారెడ్డి మాట్లాడుతూ "ఇలాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
సూర్యభగవాన్, అనురాగ్, అన్నపూర్ణమ్మ, అశోక్‌కుమార్, రాజశ్రీ, సౌజన్య, రజిత, గిరి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి కెమెరా: తోట వెంకటరమణ, సంగీతం: పి.జె. నాయుడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బిఎస్‌సి చారి, నిర్మాత: జమునారెడ్డి, దర్శకురాలు: మంజుల సూరోజు.
Advertisement
CJ Advs