త్రిషకు వయసు పెరిగి వన్నె తగ్గినా, ఆఖరుకి ఆఫర్లు హరించుకుపోయినా మీడియా మిత్రుల నుండి వస్తున్న మద్దతుకు మాత్రం డోఖా లేకుండా పోతోంది. అందుకే అమ్మడు పేరు ఏదో ఓ వంకన లైం లైట్లో నిలుస్తూనే ఉంది. మొన్నటికి మొన్న త్రిష రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధం అవుతోంది అన్న పుకారు దక్షినాది సినీ అభిమానులని షాక్కి గురి చేసింది. చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు ఎలాగో చేతిలో లేవు కనక రాజకీయ తీర్థం పుచ్చుకోవడం ఓ అందుకు మంచిదే అన్నారు కొందరు త్రిశాభిమానులు. ఇంకొందరు మాత్రం పెళ్లి విషయంలోనే నిశ్చితార్ధం నుండి ముందుకు వెళ్ళలేక పోయిన త్రిష ఇక ప్రజలని ఏ మాత్రం ఉద్ధరిస్తుంది అని పంచులు కూడా విసిరారు.
ఇవన్ని ఒక ఎత్తయితే త్రిష ఏ పార్టీలో చేరుతుందో అన్న సందిగ్ధం మీద కూడా పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలన్నీ గనక తమిళనాడు ముఖ్య మంత్రి, లేడీ పవర్ జయలలిత చెవిలో జొరబడితే త్రిషను అన్నాడీఎంకేలోకే ఆహ్వానించొచ్చు. అమ్మకు త్రిష వీరాభిమాని అయినా, పాలిటిక్సును నమ్ముకుంటే జీవితం ఎటూ కొరగాకుండా పోతోంది అన్న బెంగతో అబ్బే నేనేం రాజకీయాల్లోకి ఇప్పట్లో రాను అన్న విషయాన్ని ట్విట్టర్లో గట్టిగానే కూసేసింది త్రిష. పోనీలే ఇలాగే ప్రశాంతంగా ఉంది.