టాలీవుడ్‌లో 'శ్రీమంతుడు' ఫీవర్ మొదలైంది. ఇన్నాళ్లూ 'బాహుబలి' గురించి మాట్లాడుకొన్న పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకులు ఇప్పుడు 'శ్రీమంతుడు' కబుర్లు చెప్పుకొంటున్నారు. సినిమా అలా ఉందంట, ఇలా ఉందట... మహేష్ అదరగొట్టాడట అని మాట్లాడుకొంటున్నారు. బిజినెస్ కూడా బాగానే జరిగిందట. దానికి తోడు ప్రమోషన్ కూడా బలంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. 'శ్రీమంతుడు' ప్రమోషన్ వ్యవహారాలన్నీ మహేష్ భార్య నమ్రత చూసుకొంటున్నారట. మహేష్‌బాబు కొత్తగా బ్యానర్ పెట్టడం, ఆ బ్యానర్ సమర్పిస్తున్న తొలి చిత్రం 'శ్రీమంతుడు' కావడంతో నమ్రత ఈ సినిమాపై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు తెలిసింది. శ్రీమంతుడు తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలవుతోంది. ఇలా ఒకే సమయంలో రెండు భాషల్లో విడుదలవుతున్న మహేష్ తొలి చిత్రం ఇదే. దీంతో సినిమాకి విస్తృతమైన ప్రచారం అవసరం కాబట్టి నేషనల్ లెవెల్లో మీడియా వ్యవహారాల్ని మేనేజ్ చేస్తోందట నమ్రత. మొదట నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇప్పించి, ఆ తర్వాత లోకల్ మీడియాలో మహేష్ సందడి కనిపించనుంది. మహేష్ కొత్త సంస్థలో వరుసగా సినిమాలు నిర్మించాలన్న ఆలోచన ఉంది కాబట్టి 'శ్రీమంతుడు' రిజల్ట్ కీలకంగా మారింది. నమ్రత ప్రోద్భలంతోనే ఈ బ్యానర్ పెట్టారు కాబట్టి బలమైన పునాదులు పడేలా ఆమె చర్యలు తీసుకొంటున్నట్టు సమాచారం. నమ్రత స్వయంగా మీడియా ప్రతినిధులకి ఫోన్లు చేసి సినిమా ప్రమోషన్ గురించి అడుగుతున్నట్టు సమాచారం. శ్రీమంతుడు ఆగస్టు 7న విడుదలవుతోంది.
Advertisement
CJ Advs