మధుర గాయకుడు వి.రామకృష్ణ ఇక లేరు. మధుర గాయకుడంటే ఒకప్పుడు ఘంటసాల పేరు మాత్రమే వినిపించేది. ఆయన పాటలు పాడే రోజుల్లో ఎంత మంది గాయకులు వున్నా వారికి అంతటి పేరు రాలేదు. ఘంటసాల తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసే నేపథ్య గాయకుడుగా వి.రామకృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఘంటసాలకు సరిసమానమైన గాత్రంతో శ్రోతలు మైమరిచేలా అద్భుతమైన పాటలు గానం చేసిన ఆ గొంతు ఇప్పుడు మూగబోయింది. మహా సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ మరణవార్త విన్న రెండు రోజులకే మరో గొప్ప గాయకుడు వి.రామకృష్ణ కన్ను మూశారన్న వార్త సంగీత ప్రియుల్ని శోక సముద్రంలోకి నెట్టేసింది. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈరోజు(16) హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. తన కుమారుడు సాయికిరణ్ ని కూడా సింగర్ ని చెయ్యాలన్న అయన కోరిక తీరలేదు. హీరో కావాలన్న సాయి కోరిక ప్రకారం అతన్ని హీరోని చేసారు. సాయికిరణ్ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే.
1947 ఆగస్ట్ 20న విజయనగరంలో జన్మించిన విస్సంరాజు రామకృష్ణ 1972లో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా వచ్చిన ‘విచిత్ర బంధం’ చిత్రంలోని ‘వయసే ఒక పూలతోట’ అనే పాటను తన పిన్ని పి.సుశీలతో కలిసి పాడడం ద్వారా నేపథ్య గాయకుడుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఘంటసాలగారికి సమానంగా ఆయన తన పాటలతో శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేసి ఘంటసాలగారి ప్రశంసలు సైతం అందుకున్నారు. నా తర్వాత నా స్థానాన్ని భర్తీ చేసేది నువ్వే అని ఘంటసాల వంటి మహా గాయకుడు అన్నారంటే రామకృష్ణ పాటలో ఎంత మాధుర్యం వుంటుందో అర్థం చేసుకోవచ్చు. తన 20 సంవత్సరాల సినీ జీవితంలో 200 సినిమాల్లో దాదాపు 5000కు పైగా పాటలు పాడారు రామకృష్ణ. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి ప్రముఖ హీరోలందరికీ పాటలు పాడారు. ఘంటసాల తర్వాత నేపథ్య గాయకుడిగా రామకృష్ణ చక్రం తిప్పుతారనుకున్న టైమ్‌లో కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన గాయకుడిగా వెనకపడ్డారు. చిత్ర పరిశ్రమలోని కొన్ని పరిస్థితులే తనను వెనక్కు నెట్టాయని ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. అయితే దానికి ఆయన బాధపడలేదు. తన స్వర మాధుర్యాన్ని అందరికీ పంచే ఉద్దేశంతో ప్రైవేట్ ఆల్బమ్స్ పై తన దృష్టి పెట్టారు. లెక్కకు మించిన భక్తి గీతాలు ఆలపించడం ద్వారా శ్రోతల్ని అలరించారు.
తనకి ఉన్న టాలెంట్ కి 20 సంవత్సరాల్లో ఆయన పాడిన సినిమా పాటలు తక్కువైనప్పటికీ అన్ని పాటలు చిరస్మరణీయంగా వుండేవె పాడారు. ఆయన పాడిన పాటల్లో ముఖ్యంగా తాతమనవడు, శారద, భక్త తుకారాం, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, అందాల రాముడు, భక్త కన్నప్ప, దానవీరశూర కర్ణ, ముత్యాల ముగ్గు.. ఇలా ఇంకా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో సూపర్‌హిట్ సాంగ్స్‌ని పాడారు. వి.రామకృష్ణ కెరీర్ ప్రారంభంలో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాల ముగ్గు’ చిత్రంలోని ‘ఎదో ఏదో అన్నది.. ఈ మసక వెలుతురు..’ అనే పాట చాలా మంచి పేరు తెచ్చింది.
అపర ఘంటసాలగా పేరు తెచ్చుకొని తన పాటలతో శ్రోతల్ని రంజింప జేసిన వి.రామకృష్ణ ఇక లేరు అనే వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఘంటసాల తర్వాత అంతటి గాయకుడుగా పేరు తెచ్చుకున్న వి.రామకృష్ణలాంటి గాయకుడు మళ్ళీ రాలేదు.. ఇకపై రారు కూడా. తను పాడిన మధురమైన పాటల్ని జ్ఞాపకాలుగా వదిలి సుదూర తీరాలకు వెళ్ళిపోయిన వి.రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది ‘సినీజోష్’.