సంగీతానికి ప్రాంతీయ భేధాలు, భాషా భేదాలు లేవని, ఆస్వాదించే మనసు వుంటే వీనులకు విందేనని గతంలో ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ముఖ్యంగా తెలుగు సినిమా సంగీతంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది తమ అద్భుతమైన సంగీతంతో శ్రోతలను అలరించారు. అలాంటి వారిలో పరభాషా సంగీత దర్శకులు కె.వి.మహదేవన్, ఎం.ఎస్.విశ్వనాథన్‌లు తమిళంలో సంగీత దర్శకులుగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అంతకంటే ఎక్కువగా తెలుగు వారికి తమ సంగీతంతో దగ్గరయ్యారు. వీరిద్దరిలో 2001లో కె.వి.మహదేవన్ మనకు దూరమయ్యారు. ఈరోజు ఎం.ఎస్.విశ్వనాథన్ తన సుదీర్ఘ సంగీత ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. సంగీత ప్రేమికుల్ని విషాదంలో ముంచేసి సుదూర తీరాలకు చేరుకున్నారు.
జూన్ 24, 1928 తమిళనాడులోని పాలక్కడ్‌లో జన్మించిన ఎం.ఎస్.విశ్వనాథన్ చిన్నతనం నుంచే సంగీతంపై ప్రేమను పెంచుకున్నారు. నాలుగేళ్ళ వయసులోనే సంగీతాన్ని అభ్యసించడం ప్రారంభించి 13 ఏళ్ళ వయసులో తొలి ప్రదర్శన ఇచ్చారు. తన 17వ ఏట మద్రాసు వెళ్ళి ఎన్నో కష్టాల అనంతరం సి.ఆర్.సుబ్బరామన్‌తో కలిసి 1953లో చండీరాణి సినిమాకి సంగీతాన్ని అందించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత రమణమూర్తి అనే వయొలిన్ వాద్యకారుడితో పరిచయం ఏర్పడిరది. వారిద్దరూ కలిసి ‘విశ్వనాథమ్`రామ్మూర్తి’ పేరుతో దాదాపు 12 సంవత్సరాలు ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించారు. రామ్మూర్తితో విడిపోయిన తర్వాత ఎం.ఎస్. విశ్వనాథన్ సోలోగా సంగీతం అందించిన సినిమా ‘లేతమనసులు’. ఈ చిత్రంలోని పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత ఎం.ఎస్. వెనుదిరిగి చూసింది లేదు. ఎన్నో సినిమాలు ఘనవిజయం సాధించడంలో ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఎన్.టి.ఆర్. నటించిన ‘సింహబలుడు’ చిత్రంలోని ‘సన్నజాజులోయ్..’ పాట అప్పటికీ, ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. ముఖ్యంగా కె.బాలచందర్ కాంబినేషన్‌లో చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద విజయాన్ని సాధించాయి. అంతులేని కథ, మరోచరిత్ర, ఇది కథ కాదు, అందమైన అనుభవం, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, కోకిలమ్మ..ఇలా ప్రతి చిత్రానికీ ఎం.ఎస్. సంగీతం ప్రాణం పోసింది. సంగీత దర్శకుడిగానే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా ఎం.ఎస్. ఎన్నో పాటలు పాడారు. కె.వి.మహదేవన్, గంగై అమరన్, శంకర్ గణేష్, ఎ.ఆర్.రెహమాన్ వంటి సంగీత దర్శకుల చిత్రాల్లో వందల పాటలు పాడి సింగర్‌గా కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. 87 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ముగించుకొని ఈరోజు(14) తుదిశ్వాస విడిచిన సంగీత మేధావి ఎం.ఎస్.విశ్వనాథన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది ‘సినీజోష్’.