రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాణ సారధ్యంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా వంటి భారీ తారాగణంతో రూపొంది, ఈనెల 10వ తేదీన విడుదలకు సిద్దమవుతోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రం పైరసీ కాకుండా చిత్రబృందం మరియు పైరసీను నియంత్రించే సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి సంబంధించిన విషయాలను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసారు. ఈ సందర్భంగా..
అల్లు అరవింద్ మాట్లాడుతూ "యావత్తు భారతదేశం ఉలిక్కిపడి తెలుగు సినిమావైపు చూసే రోజు వచ్చింది. ఎన్నో వ్యయప్రయాసలతో తెరకెక్కించిన బాహుబలి చిత్రం జూలై 10న విడుదల కానుంది. ప్రతి తెలుగు వాడు, భారతీయుడు గర్వించదగ్గ విషయం 'బాహుబలి'. ఈ చిత్రం పైరసీ కాకుండా ఉండడానికి కోర్టు వారు ప్రత్యేకంగా 'జండో' అనే ఆర్డర్ అమలు చేసారు. ప్రస్తుతం ఆన్ లైన్ పైరసీ అనేది ఎక్కువైపోతుంది. సర్వీస్ ప్రొవైడర్స్ ను కంట్రోల్ చేయడం ద్వారా ఆన్ లైన్ పైరసీ ను అరికట్టవచ్చు. థియేటర్స్ వల్ల కూడా పైరసీ జరుగుతుంది. మేము ఏర్పాటు చేసిన ఏర్పాట్ల ద్వారా ఎవరు, ఎక్కడ, ఏ సమయంలో పైరసీ చేస్తున్నారో మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ కు మెసేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ థియేటర్స్ ద్వారా పైరసీ జరుగుతోందని తెలిస్తే థియేటర్ ను బ్యాన్ చేసి సినిమాలు ప్రదర్శింపబడకుండా చేస్తాం. ఈ సందర్భంగా ఆపరేటర్స్ ఇలాంటి పనులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. మాకు అన్నివిధాలా సహకరించడానికి పోలీస్ బృందం వారు ముందుకు రావాలి. 'బాహుబలి'ని ప్రేక్షకులంతా థియేటర్లలోనే చూడాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
రాజమౌళి మాట్లాడుతూ "పెద్ద సినిమా, ఎంతో ఖర్చుపెట్టి తీసిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని థియేటర్ లోనే చూడాలి. ఇంతకముందు పైరసీను అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాం. మొత్తం కాకపోయినా కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి. ఈ సినిమాకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బెంగుళూరు పోలీసులు ఈ విషయంపై మాకు ఎంతగానో సహకరించారు. థియేటర్లను బ్యాన్ చేయాలనేది మా ఉద్దేశ్యం కాదు. పైరసీ జరగకుండా ఆపరేటర్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. జూలై 10న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని అందరు ఆదరిస్తారని భావిస్తున్నాను" అని చెప్పారు.
రానా మాట్లాడుతూ "సినిమాను పైరసీ చేయడం చాలా తప్పు. అలా చేయకుండా మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో టాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి, కొడాలి వెంకటేశ్వరావు, బూరుగుపల్లి శివరామకృష్ణ, డివివి దానయ్య, శోభుయార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.