బాహుబలి తర్వాత రాజమౌళి హాలీవుడ్ వెళ్లిపోతాడు, బాలీవుడ్ వెళ్లిపోతాడు అని చెప్పుకొంటున్నారు. కథానాయకుడు ప్రభాస్ కూడా రాజమౌళి కచ్చితంగా హాలీవుడ్ వెళ్ళే స్థాయి ఉన్న దర్శకుడు . వెళ్లకుండా మనం ఆపాలంతే అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. రాజమౌళి గురించి ఎవరేమనుకొంటున్నా ఆయన మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమని వదిలి పెట్టే ప్రసక్తి లేదంటున్నారు. ఇక్కడ్నుంచే హాలీవుడ్, బాలీవుడ్ మాట్లాడుకొనేలా సినిమాలు తియ్యాలని రాజమౌళి భావిస్తున్నట్లు ఉన్నారు.
తాజా సమాచారం మేరకు రాజమౌళి బాహుబలి తర్వాత మహేష్‌బాబుతో ఓ చిత్రం చేయబోతున్నట్టు సమాచారం. ఆయన ఓ ఇంటర్వ్యూలోనూ ఇదే విషయం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది . కె.ఎల్.నారాయణ నిర్మాణంలో ఆ చిత్రం తెరకెక్కబోతోందట. అయితే ఆ సినిమాకి ఇంకా సమయం ఉందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌కి బాహుబలి కథ చెప్పడానికి ముందు ఓ బాక్సర్ కథని వినిపించాడట జక్కన్న. ఇప్పుడు అదే కథని మహేష్‌బాబుతో తెరకెక్కించే ఆలోచనలో జక్కన్న ఉన్నట్టు తెలుస్తోంది. 60, 70కోట్ల వ్యయంతో పక్కా వాణిజ్యాంశాలతో ఆ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం.