సంబిత్, మౌసుమి, స్నేహ ప్రధాన పాత్రల్లో అర్ర మూవీస్ సమర్పణలో తపస్ జేనా, ప్రదీప్ దాష్ దర్శకత్వంలో ప్రదీప్ కుమార్ అర్ర నిర్మిస్తున్న సినిమా 'ప్రమాదం'. చావు 100% అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రేయాస్ మీడియా అధినేత జి.శ్రీనివాస్ మాట్లాడుతూ "ఒరియాలో విడుదలయ్యి ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని మా సంస్థ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నాం. సినిమా మొదలయినప్పటి నుండి క్లైమక్స్ వరకు హారర్ నేపధ్యంలోనే సాగుతుంది. జూన్ 26న ఈ చిత్రాన్ని సుమారుగా 75 నుండి 100 థియేటర్లలో విడుదల చేయనున్నాం. మా సంస్థ ద్వారా ఇదివరకు 'భద్రం' సినిమాను విడుదల చేసాం. రెవెన్యూ పరంగా మంచి లాబాలొచ్చాయి. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
నిర్మాత ప్రదీప్ కుమార్ అర్ర మాట్లాడుతూ "జూన్ 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఈ చిత్రంలో కామెడీ, పాటలు, రొమాన్స్ లు ఉండవు. ఫుల్ లెంగ్థ్ హారర్ మూవీ. సినిమాలో ఏడు పాత్రలుంటాయి. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు" అని చెప్పారు.