బేబి శ్రీక్రితి సమర్పణలో ఓం సాయిరామ్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వర్గీయ పూసల దర్శకత్వం వహించిన చిత్రం ‘డాలర్‌కి మరోవైపు’. యశ్వంత్, మిత్ర జంటగా నటించారు. శ్రీమతి జమున, సత్యం నిర్మాతలు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 26న సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ... కోడలికి అన్యాయం జరిగితే లోకం కోడై కూస్తుంది. అత్తమామల్ని అంటరాని వాళ్ళుగా చేసి, భర్తని కూడా నమ్మించే కోడళ్ళ కథ తెలిసినా లోకం మౌనం వహిస్తుంది. కొడుకుని కని, చదివించి అమెరికా పంపిన తండ్రి కూడా ఈ విషయంలో నోరు మెదపడు. కారణం కోడలు తన కొడుకులో సగభాగం, వంశాభివృద్ధికి క్షేత్రదేవత కాబట్టి. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఉంది. అదే ‘మా డాలర్‌కి మరోవైపు’ సినిమా. మూడు తరాల కుటుంబాల తీపి గుర్తుల కదంబం ఈ చిత్రం. నేటి కుటుంబ వ్యవస్థకు అద్దం పట్టేలా ఉంటుంది. బంధాలు, అనుబంధాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ బాధతో గుండె బరువెక్కుతుంది. పూసల అంత అద్భుతంగా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన పాటలకు చక్కని స్పందన వస్తోంది. ఈ నెల 26న సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం అని అన్నారు.
Advertisement
CJ Advs