నేతి శివరామశర్మ, నేతి లక్ష్మి ప్రసాద్, నేతి సత్యశేఖర్ ప్రధాన పాత్రల్లో వెరైటీ విజన్స్ బ్యానర్ పై నేతి సత్య శేఖర్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన చిత్రం 'మనం అందరం ఒక్కటే'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతాని రామకృష్ణ గౌడ్ బిగ్ సిడిను ఆవిష్కరించి తొలి ప్రతిమను సాయి వెంకట్ కు అందించారు. వై.శేషగిరీశం సంగీతం అందించిన ఈ ఆడియో మార్కెట్ లోకి విడుదలయ్యింది. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ "ప్రస్తుతం చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలను నిర్మిస్తున్నా అవి రిలీజ్ చేయడానికి నిర్మాతలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న వాళ్ళంతా ఏకమైతే ఎలా ఉంటుందో 'మా' ఎలక్షన్స్ లో రాజేంద్రప్రసాద్ గారి గెలుపే ఓ ఉదాహరణ. ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న సినిమాలకి పర్సంటేజ్ ల విధానం ద్వారా థియేటర్లను ఇవ్వడం జరుగుతోంది. అదే విధంగా ఈ సినిమాకు థియేటర్లు ఇవ్వడానికి కావాల్సిన అన్ని సహాయసహకారాలు అందిస్తాం. ఈ చిత్రంలో పాటలు బావున్నాయి. సినిమా మంచి సక్సెస్ సాధించి ప్రొడ్యూసర్ కు లాబాలు రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
సాయి వెంకట్ మాట్లాడుతూ "ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో సాహిత్యం కంటే సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ డిఫరెంట్ గా ఉంది. సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. లిరిక్స్ అధ్బుతంగా ఉన్నాయి. ఈ సినిమాతో అందరికి మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
దర్శకుడు నేతి సత్యశేఖర్ మాట్లాడుతూ "జగన్నాథపురంలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇద్దరు అన్నదమ్ములు కుల వ్యవస్థపై ఏవిధంగా పోరాడారు..? ఎలా నిర్మూలించారనేది చిత్ర ఇతివృత్తం. సందేశాత్మకంగా చిత్రాన్ని రూపొందిస్తున్నాం" అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్, శివాజీరాజా, అర్జున్, పొందూరు రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : వై.శేషగిరీశం, ఛాయాగ్రహణం : మురుగన్, ఎడిటర్: కె.ఎమ్.ఎస్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : నేతి సత్యశేఖర్.
Advertisement
CJ Advs