లేచింది మొదలు పడుకొనేదాకా సినిమా గురించే ఆలోచించే కథానాయకుల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన సినిమాకి అంకితమైపోయారు. అందుకే బోలెడన్ని కళలు అబ్బాయి. నటన, రచన, దర్శకత్వం, నిర్మాణం, నృత్యం, సంగీతం, గానం... ఇలా ఒకటేమిటి? 24 విభాగాలపైనా ఆయనకు పట్టుంది. ఒక పెద్ద స్టార్‌గా గుర్తింపు తెచ్చుకొన్నప్పటికీ... సెట్‌లో ఓ శ్రామికుడిలా కష్టపడుతుంటాడు. తాజాగా `చీకటిరాజ్యం` సెట్లో స్వయంగా మేకప్ వేస్తూ కెమెరాకి చిక్కారు. కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న `చీకటి రాజ్యం`లో త్రిష, ప్రకాష్‌రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో ఆ ఇద్దరూ ప్రాస్థెటిక్ మేకప్‌తో కనిపించాల్సి ఉంటుందట. ఆ మేకప్‌ని వేసే బాధ్యతను స్వయంగా తీసుకొన్నాడు కమల్. త్రిషకీ, ప్రకాష్‌రాజ్‌కీ మేకప్ వేస్తున్నప్పుడు ఆ ఇద్దరూ తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకొన్నారు. అన్నట్టు ప్రాస్థెటిక్ మేకప్ అంటే ఏమిటో తెలుసు కదా? `ఐ`లో విక్రమ్, `లడ్డూబాబు`లో నరేష్, కమల్ `భారతీయుడు`, `భామనే సత్యభామనే` తదితర చిత్రాల్లో పోషించిన పాత్రల కోసం వేసిన గెటప్పుల్ని ప్రాస్థెటిక్‌తోనే తీర్చిదిద్దారన్నమాట. మరి త్రిష, ప్రకాష్‌రాజ్‌లు `చీకటిరాజ్యం`లో ఎలా కనిపిస్తారో చూడాలి.
Advertisement
CJ Advs