పూర్తి తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులతో తెరకెక్కిన ‘బందూక్’ చిత్ర ఆడియో సీడీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు తన క్యాంపు ఆఫీస్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘బందూక్’ చిత్ర నిర్మాత గుజ్జ యుగంధర్‌రావు, దర్శకుడు లక్షణ్ మురారీ(బాబీ), కో-డైరెక్టర్ రమేష్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్‌ఎల్‌ఎ గాదరి కిషోర్, ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగరరావు, ముఖ్యమంత్రి ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ పోరాట ఉద్యమ నేపథ్యాన్ని విస్తరిస్తూ.. పూర్తిగా తెలంగాణ కళాకారుల, సాంకేతిక నిపుణులతో ‘బందూక్’ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం. ఈ చిత్రంలోని పాటలు, అలాగే చిత్రం మంచి విజయం సాధిస్తుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేయాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ చిత్ర పరిశ్రమకు సంబంధించిన కళాకారులు, సాంకేతిక నిపుణులు మరింత క్రియాశీలకంగా మారాలని ఆకాంక్షిస్తున్నాను. త్వరలో ఈ సినిమా ప్రివ్యూని కూడా చూస్తాను..’’ అన్నారు.
దేశపతి శ్రీనివాస్, మిధున్‌రెడ్డి, చైతన్య, జోషి, దేవా, మధు, శహెరా మొదలగువారు ఈ చిత్ర తారాగణం.