నవీన్ విజయ్ కృష్ణ, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’. రామ్‌ప్రసాద్ రఘుతు దర్శకత్వంలో చంటి అడ్డాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ, టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల దంపతులు టైటిల్‌ను ఆవిష్కరించగా, కృష్ణ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ ‘‘మా ఫ్యామిలీలో మొదటితరాన్ని అభిమానులు ఆదరించారు. తర్వాత రెండవ తరంలో వచ్చిన నరేష్, మహేష్, మంజులను కూడా అభిమానించారు. ఇప్పుడు మూడో తరంలో ముందుగా నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా వస్తున్నాడు. తనని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. తనకి సూపర్‌స్టార్ ఇమేజ్ రావాలి. నిర్మాత చంటి అడ్డాలకు తను ఖర్చు పెట్టిన దానికి పదిరెట్లు ఆదాయం రావాలి’’ అన్నారు.
శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ ‘‘మ్యూజిక్ విన్నాను సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి. కథ చాలా బాగా ఉంది. టైటిల్‌లోనే మంచి కథ కనపడుతుంది. నరేష్‌ను నేను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నప్పుడు జంధ్యాలగారు నేను పరిచయం చేస్తానన్నారు. పరిచేయం చేసి పెద్ద హీరోను చేశారు. ఇప్పుడు అలాగే నవీన్ విజయ్‌కృష్ణను చంటిఅడ్డాల పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నవీన్ విజయ్‌కృష్ణ మాట్లాడుతూ ‘‘చాలా టైటిల్స్ వెతికాం. అయితే కృష్ణవంశీగారి ఖడ్గం సినిమాలో సీతారామశాస్త్రిగారు రాసిన ఒక పాట నుండి ఈ టైటిల్‌ను తీసుకున్నాం. సపోర్ట్ చేసిన నా గ్రాండ్ పేరెంట్స్‌కి, డాడీకి థాంక్స్’’ అన్నారు.
నరేష్ మాట్లాడుతూ ‘‘చంటి అడ్డాలగారు తనదైన శైళిలో ఫ్రెండ్లీ మూవీస్ అనే బ్యానర్‌ను స్టార్ట్ చేసి మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. కృష్ణవంశీ దగ్గర పనిచేసిన రామ్‌ప్రసాద్‌గారు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్టోరితో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ తరం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో మంచి ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో ఆకట్టుకుంటున్న అచ్చు సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. త్వరలోనే సినిమా ఆడియో గ్రాండ్ లెవల్‌లో విడుదల కానుంది. మా ఫ్యామిలీలో మూడు తరాల వారిని అభిమానిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. కృష్ణ, విజయనిర్మలగారి చేతుల మీదుగా టైటిల్, టీజర్ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. మూడు పదాల టైటిల్ చాలా శుభసూచకం’’ అన్నారు.
డైరెక్టర్ రామ్‌ప్రసాద్ రగుతు ‘‘చాలా టైటిల్స్‌ను అనుకున్నప్పటికీ కథకు సరిపడా టైటిల్ కోసం చాలా సెర్చ్ చేశాం. లవ్ ఎక్స్‌ప్రెస్ చేసే సినిమాలను చేసిన కృష్ణవంశీగారి పర్మిషన్ తీసుకుని ఆయన సినిమాలో పాటను ఈ సినిమాకు టైటిల్‌గా పెట్టాం. తప్పకుండా అందరికి నచ్చే చిత్రం అవుతుంది..' అన్నారు.
నిర్మాత చంటి అడ్డాల మాట్లాడుతూ ‘‘అందరు టైటిల్ ఏంటి అని అడుగుతుంటే.. ఎప్పటి కప్పుడు టైటిల్ కోసం చూస్తూనే వున్నాం. సుమారు రెండు నెలలుగా ప్రెషర్ పెడితే ఇంత మంచి టైటిల్ వచ్చింది. యూత్‌ఫుల్ టైటిల్. నవీన్ వాళ్ల నాన్నమ్మపై ఎంత ఇష్టమో ఈ టైటిల్ తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల రెండో వారంలో సినిమా ఆడియో విడుదల ఉంటుంది. అన్నీ కార్యక్రమాలు పూర్తయితే సినిమాని జూన్ 19 గానీ లేక 26న గానీ చేయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు.
నాగబాబు, రాహుల్‌దేవ్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, బండ రఘు, కొండవలస తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు, రచయిత: సురేష్ బాబు వర్ధినేని, నిర్మాత: చంటి అడ్డాల, దర్శకత్వం: రామ్‌ప్రసాద్ రగుతు.