ఒకప్పుడు సినిమా రైట్స్‌కి ఎంత పోటీ వుండేదో ఆడియో రైట్స్‌కి కూడా అంతే పోటీ వుండేది. పెద్ద హీరోల సినిమాల ఆడియో రైట్స్ దక్కించుకునేందుకు ఆడియో కంపెనీలు పోటీపడేవి. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది బాగా విస్తరించిన తర్వాత సినిమాల ఆడియోలకు అంత ప్రాధాన్యత లభించలేదు. డిజిటల్‌గా, రింగ్ టోన్స్ ద్వారా, డౌన్‌లోడ్స్ ద్వారా, కాలర్ ట్యూన్స్ ద్వారా ఆడియో కంపెనీలకు ఎప్పుడైతే ఆదాయం పెరిగిందో అప్పటి నుంచి పెద సినిమాల ఆడియో రైట్స్ విషయంలో కొంత పోటీ ఏర్పడిరది. ఎంత పోటీ వున్నా ఆడియో రైట్స్‌కి ఇచ్చే ఎమౌంట్ అనుకున్నంతగా పెరగలేదు. ఈమధ్య వచ్చిన సినిమాల్లో ఏ ఆడియోకి ఎంత ఆఫర్ ఇచ్చి తీసుకున్నారనేది పక్కన పెడితే లేటెస్ట్ సెన్సేషన్ ‘బాహుబలి’ చిత్రం మాత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. దక్షిణ భారత చలన చిత్ర చరిత్రలో ఏ చిత్రం ఆడియోకీ ఇప్పటివరకు ఇవ్వని ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి లహరి మ్యూజిక్ సంస్థ రైట్స్‌ని సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ ఆడియో రైట్స్‌ని సొంతం చేసుకున్న లహరి మ్యూజిక్ రెండు భాషల్లో ‘బాహుబలి’ ఆడియోలను రిలీజ్ చేయబోతోంది.
‘బాహుబలి’ చిత్రంపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో వున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచేలా చిత్రంలోని క్యారెక్టర్లకు సంబంధించిన పోస్టర్స్‌ను రిలీజ్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. కాగా, ఈ చిత్రంలోని పాటలు ఎలా వుండబోతున్నాయనే దానిపై సంగీత ప్రేమికులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఎందుకంటే పాటలు అందరి అంచనాలను మించి వుండేలా కీరవాణి శ్రద్ధ తీసుకుంటున్నారు. సినిమాని ఎంతో భారీగా, భారతీయ సినిమాలోనే అందరూ చెప్పుకునే రీతిలో తెరకెక్కిస్తున్న రాజమౌళి చిత్రంలోని పాటల విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా వుండగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మే 31న విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ఇదివరకే ప్రకటించారు. ఈ చిత్రం ఆడియోను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆర్కా మీడియా అధినేతలు.
ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్ నాయుడు మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులందరూ ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచే వుండే ఈ రెండు చిత్రాలు మా ఆల్బమ్‌లో వుండాలని తొలుత ‘రుద్రమదేవి’ ఆడియో రైట్స్ కొన్నాము. వైజాగ్, వరంగల్‌లలో ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత సినీ పరిశ్రమలో లేటెస్ట్ సేన్షేషన్ ‘బాహుబలి’. ఈ చిత్రం ఆడియోకు ఎంతో పోటీ వున్నప్పటికీ మంచి ఫాన్సీ ఆఫర్ ఇచ్చి ఈ ఆడియో రైట్స్ సొంతం చేసుకున్నాం. ‘బాహుబలి’ ఆడియో కూడా మా సంస్థ ద్వారా త్వరలో విడుదల చేస్తున్నామని తెలియచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా వుంది. తెలుగు, తమిళ్ ఆడియో రైట్స్ మాకే ఇచ్చి మమ్మల్ని ప్రోత్చాహించిన రాజమౌళిగారికి, కీరవాణిగారికి, శ్రీవల్లిగారికి, నిర్మాతలు కె. రాఘవేంద్రరావుగారికి, శోబు యార్లగడ్డగారికి, ప్రసాద్ దేవినేనిగారికి ధన్యవాదాలు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాల ఆడియోలు మేం కలిగి వుండడం మాకు, మా సంస్థకు గర్వకారణంగా భావిస్తున్నాం’’ అన్నారు