మంచు కుర్రాడు మనోజ్ పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. కనీవినీ ఎరుగని రీతిలో పెళ్లి జరిపేందుకు మంచు కుటుంబం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 20న ముహూర్తం నిర్ణయించారు. వారం రోజుల ముందుగానే సందడి మొదలైంది. గురువారం మనోజ్‌ని పెళ్లి కొడుకుని చేశారు. ఆ వేడుకని తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఆహ్వానించింది మంచు కుటుంబం. చిరంజీవి, బాలకృష్ణ తదితర అగ్ర కథానాయకులు మొదలుకొని పలువురు సినీ ప్రముఖులు నిన్న మోహన్‌బాబు ఇంట్లోనే గడిపారు.
అతిథి మర్యాదలకు పెట్టింది పేరైన మోహన్‌బాబు తనదైన శైలిలో ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకకోసం మోహన్‌బాబు భారీగా ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. మంచు కుటుంబంలో మనోజ్ చిన్నవాడు. అందుకే మరింత గ్రాండ్‌గా పెళ్లి జరపాలని మంచుకుటుంబం నిర్ణయించింది. నెల రోజులుగా మోహన్‌బాబు ఫ్యామిలీ అతిథుల్ని ఆహ్వానిస్తూ ఏర్పాట్లు చేసుకొంటోంది. ఈ నెల 20న జరిగే పెళ్లి వేడుకకి భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు.. రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు.