ఎన్నో భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆస్కార్ వి.రవిచంద్రన్, ఆస్కార్ ఫిలిం ప్రై. లిమిటెడ్ పతాకంపై ధనుష్ హీరోగా భరత్‌బాల దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన చిత్రం ‘మరియన్’. తమిళ్‌లో హిట్ అయిన ఎన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన శోభారాణి ఎస్.వి.ఆర్. మీడియా ప్రై. లిమిటెడ్ ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఓ పాటను స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహ్మాన్ పాడారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ "ఎస్.వి.ఆర్. మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మంచి సినిమాలను అందించాం. ఒక యదార్థ సంఘటన ఆధారంగా చేసిన 'మరియన్' చిత్రాన్ని కూడా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. తమిళంలో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన ఏ.ఆర్.రెహ్మాన్ ఓ పాట కూడా పాడారు. ఆయన పాడిన పాట తమిళంలో సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల వరకు అందరి నోటా వినిపించింది. తెలుగులో కూడా ఆయనతో పాడించాలనే ఉద్దేశ్యంతో రెహ్మాన్ గారిని సంప్రదించాం. మొదట ఆయన షెడ్యూల్ బిజీ గా ఉండడం వలన అంగీకరించకపోయినా మేము రిక్వెస్ట్ చేసిన తరువాత తెలుగులో కూడా పాడడానికి ఒప్పుకున్నారు. సినిమా క్లైమాక్స్ లో హీరోకి బ్రతకడానికి ఏ విదమైన హొప్ లేనప్పుడు హీరోయిన్ జ్ఞాపకాలు ప్రేరేపిస్తూ మనసులో దృడమైన నిశ్చయంతో ఆమెను చేరుకోవాలనే ప్రయత్నంలో వచ్చే 'మనసా పదా' అనే పాట అది. మంచి సన్నివేశాలతో కలగలిపిన సాంగ్. ఆ పాటలో ధనుష్ పెర్ఫార్మన్స్ అధ్బుతం. రెహ్మాన్ గారు సాంగ్ పాడడంతో పాటు ఫైనల్ మిక్స్ కూడా చేసివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటతో సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. సినిమాకి ఎడిటింగ్ అనేది చాలా ముఖ్యం. హర్షవర్ధన్ గారు చాలా చక్కగా ఎడిట్ చేసారు. మంచి విందుభోజనం లాంటి సినిమా ఇది" అని తెలియజేసారు.