‘ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా కలిసిఉంటేనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే కథాంశంతో ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అని అన్నారు ఎమ్.ఎస్. బాబు. తారా నీలూ ప్రొడక్షన్ స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’. పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ‘‘గ్యాంగ్ ఆఫ్ గబ్బర్‌సింగ్’ తర్వాత నేను చేస్తున్న చిత్రమిది. ప్రకృతిలోని అన్ని రకాల పువ్వులను పేర్చి బతుకమ్మ పండుగను చేస్తారు. ఆ విధంగానే భిన్న సంస్కృతుల ప్రజలంతా కలిసి ఉండాలనే సందేశంతో రూపొందిస్తున్న చిత్రమిది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, యాస, భాష మీద చాలా పరిశోధన చేసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రంలోని కవులు, కళాకారులు, మేధావులని కలిసి వారి అభిప్రాయాలు సేకరించాము. ఈ చిత్రానికి ప్రజా గాయకుడు గోరటి వెంకన్న పాటలు, రచన సహకారం అందిస్తున్నారు’ అని తెలిపారు. ప్రముఖ నటీనటులతో పాటు తెలంగాణ కళాకారులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: గిరి దోసడ, ఎడిటింగ్: ఉపేంద్ర, నిర్వహాణ: ఎస్.కె. మఖ్భూల్, సంగీతం, దర్శకత్వం: ఎమ్.ఎస్.బాబు.