సార్వత్రిక ఎన్నికల్ని తలపించేలా ఎన్నడూ జరగని రీతిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, సహజనటి జయనుధ అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ఇక్కడున్న ఓటర్ల సంఖ్య 702 మాత్రమే. ఎప్పుడు 40 నుంచి 50 శాతం మాత్రమే పోలింగ్ జరిగేది. గత ఎన్నికల్లో 339 ఓట్లు పోల్ కాగా ఈసారి అందుకు భిన్నంగా 392 ఓట్లు పోల్ అయ్యాయి. గత నెల 29న జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఓ.కల్యాణ్ కోర్ట్‌లో పిటిషన్ వేసిన కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ఈ నెల 17 మద్యాహ్నాం 3 గంటలకు ఫలితాల్ని వెల్లడిరచుకోవచ్చని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యకమ్రం జరుగనుంది.
ఎన్నికలకు ముందు ఇరువైపు పోటీదారులు ఎన్నో వాగ్ధానాలు చేసేశారు. ఇది మంచి పరిణామమే. తెల్లారితే సెట్స్‌లో మోహమోహాలు చూసుకోవాలనే ఆలోచన లేకుండా తిట్ల వర్ణంతో ఇరు పోటీదారులు రెచ్చిపోయి మాట్లాడి సినిమా పరిశ్రమ పరువును రోడ్డెక్కించారు. ఎన్నికలు రోజు మాత్రం కడుపులో ఎన్నునా ఒకరికొకరు ప్రేమను ఒలకపోసుకుంటూ పెదాలపై ఇష్టంలేని నవ్వును చిందిస్తూ ఆలింగనం చేసుకుని జనాల్ని వెర్రివాళ్లను చేశారు. ఇదంతా సరే అంతకన్నా ముందు ఎవరి ఇష్టం వచ్చినట్లు ఛానెల్స్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చి ఒకరిని ఒకరు దూషించుకుంటూ, ఎన్నో విమర్శలు, నానా గందరగోళం నడుమ ఎన్నికలు పూర్తి చేశారు.
వాగ్ధానాల పరిస్థితి ఏంటి?
ఇరుపార్టీలు ఓట్ల కోసం అది చేస్తాం. ఇది చేస్తాం అని తమతమ మానిఫెస్టోలు బయటపెట్టారు. ‘‘ఇదివరకెప్పుడూ ఇలా జరగలేదనీ, ఇది మంచి పరిణామమనీ, ‘మా’ అధ్యక్ష కుర్చీ ఇప్పటి వరకు అలంకారప్రాయంగానే ఉందనీ, ఇకమీదైనా ఆ కుర్చీకి చలనం వచ్చి కుర్చీలో కూర్బోబోయే వారు వాగ్ధానాలు నిలబెట్టుకోవాలని నటి, నగరి ఎమ్యేల్యే రోజాతోపాటు పలువురు సినీ ప్రముఖులు చెప్పకనే చెప్పారు. సాధారణ నటులు మాత్రం మాకేం చెయ్యబోతున్నారు అని కుర్చీని అలంకరించేవారిని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారు. మురళీమోహన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నపేద కళాకారుల్ని ఏమాత్రం పట్టించుకోలేదనీ, 12 ఏళ్లు ఏకగ్రీవంగా నెగ్గిన ఆయన అసోసియేషన్ అధ్యక్షుడిగా వెలగబెట్టింది ఏమీ లేదని, బంధుప్రీతి చూపించాడనే విమర్శలు వినబడిన విషయం తెలిసిందే. ఈసారి అందుకు భిన్నంగా ఉండాలని, పేదకళాకారులకు మంచి జరగాలని వారి ఆశ.
గెలుపు ఎవరిది?
కొందరు మినహా పరిశ్రమకు చెందిన పెద్దలంతా జయసుధకు సపోర్ట్ చేశారు. రాజేంద్రప్రసాద్‌కు చిన్న ఆర్టిస్ట్‌ల సపోర్టే ఎక్కువ. పోల్ అయిన ఓట్లు కూడా చిన్న ఆర్టిస్ట్‌లదే ఎక్కువ శాతం ఉంది. పరిశ్రమకు చెందిన పెద్దలెవరూ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ రకంగా చూస్తే రాజేంద్రుడే గెలుస్తాడని ఓ నమ్మకం. కోట శ్రీనివాసరావు వంటి ప్రముఖులు జయసుధ ప్యానల్ ప్రవర్తన, వారి లెక్కలూ న్యాయంగా లేవనీ, వారికి ఓటు వేసేది లేదని గీతాంజలి, జయలక్ష్మిలకు ఆరోజు మోహం మీదే చెప్పారు. ఈ తరహా సమాధానం ఇచ్చిన వారెందరో ఉన్నారు. మురళీమోహన్ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అందుకే మార్పు కోసం ‘మా’ ఎలక్షన్లు మాంచి వేడిగా జరిగాయి. మరీ వేడి తగ్గడానికి మరో రెండు రోజులు పడుతుంది.