‘కత్తి’ చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్ లేటెస్ట్‌గా శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై పి.టి.సెల్వకుమార్ నిర్మిస్తున్న ‘పులి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌గానీ, సినిమా స్టిల్స్‌గానీ ఇప్పటివరకు బయటికి రాలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. చెన్నయ్, కేరళలోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు తిరుపతి దగ్గరలోని తలకోన ఫారెస్ట్‌కి షిఫ్ట్ అయింది. దట్టమైన అడవి కావడంతో రోడ్డు సదుపాయం కూడా సరిగ్గా లేదు. దీంతో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వని నిర్మాతలు యూనిట్ సభ్యులు షూటింగ్ స్పాట్‌కి వెళ్ళడం కోసం రోడ్లు, ఉడెన్ బ్రిడ్జ్‌లు నిర్మించారు. ఈ ఫారెస్ట్‌లో 200 మంది కార్పెంటర్స్, 100 మంది మౌల్డర్స్, 50 మంది వెల్డర్స్ 100 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి భారీ విలేజ్ సెట్‌ని నిర్మించారు. నిజమైన విలేజ్‌ని చూస్తున్నామా అని విలేజ్ సెట్‌ని చూసిన యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారు.
ఈ సెట్‌లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో విజయ్‌తోపాటు శృతి హాసన్, ప్రభు, తంబి రామయ్య, సత్యన్, జూనియర్ బాలయ్య, నరేన్, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రి తదితరులు పాల్గొంటారు. ఈ పాటను శ్రీధర్ మాస్టర్ నృత్యదర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటను ఒక పండగ వాతావరణం తలపించేలా ఎంతో భారీగా చిత్రీకరిస్తున్నారు. ఇంకా ఈ ఇంట్రడక్షన్ సాంగ్‌లో 300 మంది జూనియర్ ఆర్టిస్టులు, ముంబాయి, చెన్నయ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వచ్చిన 200 మంది డాన్సర్లు పాల్గొంటున్నారు. ఈ పాట కోసం 250 మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.
ఈ పాటను 5 కోట్ల 25 లక్షల రూపాయలు భారీ బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు. అలాగే ఈ సినిమాను 118 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి ఏకధాటిగా ఈరోజు 115వ రోజు షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత 25 రోజులపాటు ఇండియాలోనే ముఖ్యమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకొని 15 రోజులపాటు విదేశాలలో షెడ్యూల్ చెయ్యడానికి ప్లాన్ చేశారు నిర్మాతలు.
విజయ్, శృతి హాసన్, హన్సిక, ఆలిండియా స్టార్ శ్రీదేవి, కన్నడ స్టార్ సుదీప్, ప్రభు, తంబి రామయ్య, సత్యన్, జూనియర్ బాలయ్య, నరేన్, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎస్.కె.టి. స్టూడియోస్ బేనర్‌పై శింబు దేవన్ దర్శకత్వంలో పి.టి.సెల్వకుమార్, శిబు నిర్మిస్తున్నారు.