నందమూరి తారకరత్న హీరోగా లగడపాటి వెంకాయమ్మ సమర్పణలో శ్రీ ఎల్.వి.ఆర్. ప్రొడక్షన్స్ పతాకంపై విజయ సముద్ర దర్శకత్వంలో లగడపాటి శ్రీనివాస్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కాకతీయుడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లాంచ్ ఆదివారం దర్శకరత్న డా. దాసరి నారాయణరావు నివాసంలో జరిగింది. దర్శకరత్న డా. దాసరి నారాయణరావు కాకతీయుడు టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో తారకరత్న, దర్శకుడు విజయ సముద్ర, నిర్మాత లగడపాటి శ్రీనివాస్, హీరోయిన్లు శిల్ప, యామిని, రేవతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
డా.దాసరి నారాయణరావుః టైటిల్ చూసి రెగ్యులర్‌గా వస్తున్న చిత్రాలకు భిన్నమైన జోనర్‌లో ఈ సినిమాని చేసి వుంటారనుకున్నాను. టీజర్ చూసిన తర్వాత ఇది పక్కాగా కమర్షియల్ ఫార్మాట్‌లో వుంది. సినిమాని అన్ని కమర్షియల్ హంగులతో తీశారని అర్థమైంది. ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు, ఎన్నో కమర్షియల్ హిట్స్ తీసిన సముద్ర ఎందుకో కాస్త వెనకపడ్డాడు. అయినా పట్టుదలతో ఈ చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రంలో తారకరత్న రెండు వేరియేషన్స్ వున్న క్యారెక్టర్స్ చేశాడు. ఒక క్యారెక్టర్ కోసం 8 నెలలు టైమ్ తీసుకొని డిఫరెంట్ గెటప్ కోసం ట్రై చేశాడు. దానికి అతన్ని అభినందించాలి. ఇలాంటి సినిమాలు ఇంకా జనంలోకి రావాల్సిన అవసరం వుంది. ఈ చిత్రం ద్వారా ముగ్గురు తెలుగమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నందుకు ఈ దర్శకనిర్మాతలను అభినందిస్తున్నాను. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు వున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
విజయ సముద్రః మా కాకతీయుడు చిత్రం టీజర్ గురువుగారు దాసరి నారాయణరావుగారి చేతులమీదుగా విడుదలవడం చాలా సంతోషంగా వుంది. గురువుగారి ఆశీస్సులు వుంటే తప్పకుండా మా సినిమా సక్సెస్ అవుతుందని మా నమ్మకం. ఆయన చేతుల మీదుగా మా చిత్రం టీజర్ రిలీజ్ అవడమే ఫస్ట్ సక్సెస్‌గా భావిస్తున్నాము. ఈ చిత్రంలో తారకరత్న డూయల్ రోల్ చేశారు. రెండో క్యారెక్టర్ కోసం ఎనిమిది నెలలు కష్టపడ్డారు. గురువుగారు చేసిన బొబ్బిలిపులి సొసైటీకి ఒక సందేశాన్ని ఇచ్చి ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ఈ సినిమా కూడా అంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
నందమూరి తారకరత్న, శిల్ప, యామిని, రేవతి, వినోద్‌కుమార్, ప్రభ, లగడపాటి వెంకట్రావు, విజయరంగరాజన్, ప్రభావతి, తిరుపతి ప్రకాష్, సంజయ్, ఆజాద్, అనిల్, రోహిత్, భగవాన్, రుద్రకిషన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః యస్.ఆర్.శంకర్, సినిమాటోగ్రఫీః పి.మహదేవ్, ఎడిటింగ్ః నందమూరి హరి, కథ, మాటలుః మల్కార్ శ్రీనివాస్, ఫైట్స్ః నందు, ఆర్ట్ః ఠాగూర్, గురుచరణ్, పాటలుః మాతుమూరి రామారావు, సహనిర్మాతలుః గుర్రం మహేష్ చౌదరి, తెల్ల సుధీర్‌బాబు, గూడూర్ గోపాల్‌శెట్టి, పొందూరు కాంతారావు, నిర్మాతః లగడపాటి శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః విజయ సముద్ర.