ఆదిత్యా ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ డి.వి.సీతారామరాజు(వైజాగ్ రాజు) నిర్మాతగా ఆయన తనయుడు కార్తిక్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం 'టిప్పు'. జగదీశ్ దానేటి దర్శకుడు. సంస్కృతి, కనికాకపూర్ నాయికలు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఆదివారం(మార్చి 29) హైదరాబాద్ లో జరిగింది. మంత్రివర్యులు అయ్యన్నపాత్రుడు బిగ్ సిడి ను ఆవిష్కరించి తొలి ప్రతిమను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కు అందించారు. ఈ కార్యక్రమంలో సత్యానంద్, సుబ్బిరామిరెడ్డి, కె.ఎస్.రామారావు, ఆర్.నారాయణమూర్తి, బి.గోపాల్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, భాస్కర్ భట్ల, చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ "సినీ పరిశ్రమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి వైజాగ్ రాజు. అతని కుమారుడు కార్తిక్ హీరోగా పరిచయం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సినిమా ట్రైలర్ చాలా బావుంది." అని అన్నారు.
సత్యానంద్ మాట్లాడుతూ "కార్తిక్ నటించిన ఏ.వి ఓ ప్రముఖ దర్శకునికి పంపగా ఆయన వెంటనే ఫోన్ చేసి చాలా బాగా నటించాడు అని అప్రిషియేట్ చేసారు. కార్తిక్ చాలా సిన్సియర్ గా ఉంటాడు. తను చాలా చిత్రాలలో నటించి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
రాఘవేంద్రరావు మాట్లాడుతూ "సంగీతంలో రారాజు మణిశర్మ, ప్రొడ్యూసర్ వైజాగ్ రాజు, హీరో కార్తిక్ రాజు ఇంతమంది రాజులు కలిస్తే విజయం తప్పదు" అని చెప్పారు.
సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ "రాజు గారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్. ఎంతోమందికి స్నేహితుడు. వారి తనయుడు కార్తిక్ చాలా అందంగా ఉన్నాడు. 'టిప్పు' టైటిల్ చాలా బావుంది. సినిమా మంచి సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
కె.ఎస్.రామారావు మాట్లాడుతూ "వైజాగ్ రాజు గారితో 40 సంవత్సరాల స్నేహం నాది. ఆయన ఒక సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ మాది. కార్తిక్ కు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం. జగదీశ్ చాలా బాగా డైరెక్ట్ చేసాడు. ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే ఈ సినిమా ఖచ్చితంగా గా హిట్ అవుతుంది" అన్నారు.
బి.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ "ట్రైలర్ లో కార్తిక్ చాలా అందంగా ఉన్నాడు. మణిశర్మ మంచి స్వరాల్ని అందించాడు. జగదీశ్ తన టాలెంట్ తో డైరెక్టర్ అయ్యాడు. 'టిప్పు' పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అన్నారు.
డైరెక్టర్ జగదీశ్ దానేటి మాట్లాడుతూ "సినిమాపై ప్యాషన్ తో బి.గోపాల్, పూరిజగన్నాథ్ వంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. వినాయక్ గారు నాకు రైటర్ గా జన్మనిచ్చారు. దర్శకునిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో నా దగ్గరున్న కథని రాజు గారికి చెప్పాను. వారబ్బాయికి పెద్ద బ్యానర్ లో అవకాశం ఉన్నప్పటికీ నా కథ మీద నమ్మకంతో సినిమా నిర్మించారు" అని అన్నారు.
హీరో కార్తిక్ మాట్లాడుతూ "జగదీశ్ గారు చెప్పిన స్క్రిప్ట్ నచ్చి నాన్నగారు వెంటనే ఓకే చెప్పారు. ఇది రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. నా మొదటి సినిమాకు మణిశర్మ గారు మ్యూజిక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. రాజశేఖర్ గారి సినిమాటోగ్రఫీ అధ్బుతంగా ఉంటుంది" అని చెప్పారు.
హీరోయిన్ కనికా కపూర్ మాట్లాడుతూ "ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి నా ధన్యవాదాలు" అని తెలిపారు.