'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలలో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్, జయసుధ వారు ఎన్నికైతే ఎలాంటి సేవలు చేస్తారో హామీలు ఇస్తున్నారు. రాజేంద్రప్రసాద్ 'మా' కోసం బిల్డింగ్ కట్టిస్తానని, 5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి పేద కళాకారులకు పెన్షన్లు ఇప్పిస్తామని వెల్లడించారు. అయితే జయసుధ ప్యానెల్ శుక్రవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఓ 'అజెండా'ను ప్రకటించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ "మా ఎన్నికలు ఇంత దారుణంగా మారుతాయని అనుకోలేదు. నేను డమ్మీ కాండిడేట్ అని నా వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఎవరో చెప్పినట్లు పని చేయాల్సిన స్థితిలో నేను లేను. ఈరోజు మా ప్యానెల్ తరఫున మేము ఎన్నికైన తరువాత పేదకళాకారులకు ఎలాంటి సేవా కార్యక్రమాలు అందించబోతున్నామో తెలియజేయాలనుకుంటున్నాం. అందరిలాగా ఒక నెంబర్ చెప్పి ప్రజలను మోసం చేయాలనుకోవట్లేదు. ఆర్ధికపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో సర్వే చేసి వాళ్ళని ఖచ్చితంగా ఆదుకొనే ప్రయత్నం చేస్తాం. ఫండ్స్ కోసం ముందుగా మా ప్యానల్ నుంచి ఎవరికి తోచినంత వారు ఇవ్వాలని నిశ్చయించుకున్నాం. వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఫండ్స్ కలెక్ట్ చేయబోతున్నాం. ఓ కమిటీ ఏర్పాటు చేసి ఎవరికి ఏ సహాయం కావాలో అందులో నమోదు చేసుకునే విధంగా చేయనున్నాం. పేదకళాకారుని ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలలో 'మా' తరఫున కొంత సహాయం చేస్తాం. 750 పేద కళాకారుల కుటుంబాలను ఒక దగ్గరకు చేర్చి వాళ్లకు సంక్షేమ పధకాలను చేకూరేలా చూసుకుంటాం" అని తెలిపారు.